హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు లో ఉన్న రాష్ట్ర క్రీడాకారిణి ధృతికి ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సహకంగా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. త్రిష, ధృతి రాష్ట్రం తరఫున దేశానికి ప్రాతిని ధ్యం వహించారని గుర్తుచేశారు. త్రిషకు రూ.కోటి ఇచ్చిన ప్రభుత్వం, ధృతికి రూ.10 లక్షలు ఇవ్వడం సరికాదని చెప్పారు. వరల్డ్ కప్ ప్రైజ్ మనీని కూడా జట్టులోని 15 మంది కి సమానంగా పంచుతారని గుర్తుచేశారు. ఒకరికి ఇచ్చి మరొకరి కి ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో స్పోర్ట్స్ గ్రౌండ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్రం నుంచి రూ.1.50 లక్షల కోట్లు, కేంద్రం నుంచి రూ.1.50 లక్షల కోట్లు తీసుకొచ్చి రూ.3 లక్షల కోట్లతో ఒలింపిక్స్ నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో అందాల పోటీలు కాదని, ఒలింపిక్స్ నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు వస్తుందని చెప్పారు.