హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ సరఫరా కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 24.27 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.140 కోట్లను వెచ్చించనున్నది. బడులు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫామ్ ఇచ్చే దిశగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. కార్పొరేట్ తరహాలో సరికొత్త డిజైన్లను ఇప్పటికే ఆమోదించింది. ఆయా డిజైన్ల ప్రకారం యూనిఫామ్‌ను సిద్ధంచేసే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ చొప్పున ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు డీఈవోలకు మార్గదర్శకాలను పంపారు. మొత్తంగా 24,27,391 మంది విద్యార్థులకు 1,26,96,313.30 మీటర్ల వస్ర్తాన్ని తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారా విద్యాశాఖ కొనుగోలు చేసింది. ఆ వస్త్రం ఇప్పటికే మండలాలకు చేర్చింది. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలకు వస్ర్తాన్ని అప్పగిస్తున్నారు.
50శాతం యూనిఫామ్‌ను స్థానికంగా ఉండే దర్జీల ద్వారా కుట్టించాలని ఇటీవలే విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన కలెక్టర్లకు లేఖలు రాశారు. మే 31లోగా వీటిని కుట్టించే ప్రక్రియను చేపట్టి గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. నిరుడు స్వయం సహాయక బృందాల ద్వారా వీటిని కుట్టించే ప్రయత్నం చేయగా, ఈ విద్యాసంవత్సరం స్థానికంగా ఉండే దర్జీలకు ఈ పనిని అప్పగించారు. ఒక్కో యూనిఫామ్ తయారీకి రూ.50 కూలిగా ఇవ్వనున్నారు.