హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని (Assembly) ఓ ప్రహసనంగా మార్చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy ) ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కేందుకు ప్రయత్నించినా ప్రజాక్షేత్రంలో మాత్రం మా గొంతు నొక్కలేరని అన్నారు.
శాసనసభ రూల్ బుక్ ప్రకారం అసెంబ్లీ నడవడం లేదని , లగచర్ల ( Lagacharla) రైతులకు బేడీల వేసిన ఘటనపై రెండు రోజులుగా చర్చకు పట్టుబడుతున్నా చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుందని మండిపడ్డారు. లగచర్చ, ఫార్ములా -ఈ ఘటనలపై కాంగ్రెస్కు దమ్ముంటే చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చించే ధైర్యం లేక రేవంత్ (Revanthreddy) మొహం చాటేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ మోసాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శాసనసభను పదిహేను రోజులు నడిపి, బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి పనిని చర్చిద్దామని సూచించారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందని, ప్రభుత్వం అన్నివ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కేసులు, అరెస్టులు అంటూ నాలుగు గోడల మధ్య ఉండి రేవంత్ వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు.