హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల్లోని రూ.365.84 కోట్లను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు చెందిన బకాయిలు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ సంక్షేమశాఖ సంబంధించి రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమశాఖకు రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.152.59కోట్లను విడుదల చేసినట్టు వివరించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆర్థిక, సంక్షేమశాఖల అధికారులతో ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా,అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు 17.65శాతం కరువుభత్యం(డీఏ) పెంచినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 71,651 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పెంచిన డీఏ 2025 జూలై 1 నుంచి వర్తించనున్నట్టు తెలిపారు. టీజీట్రాన్స్కోలో 3,036 మంది రెగ్యులర్, 3,769 మంది ఆర్టిజన్లు, 2,466 మంది పెన్షనర్లు, టీజీజెన్కోలో 6,913 మంది ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లు, 3,579 మంది పెన్షనర్లు, టీజీఎస్పీడీసీఎల్లో 11,957 మంది ఉద్యోగులు, 8,244 మంది ఆర్టిజన్లు, 8,244 మంది పెన్షనర్లు, టీజీఎన్పీడీసీఎల్లో 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది ఆర్టిజన్లు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనున్నట్టు వివరించారు.