ఎల్లారెడ్డిపేట, మే 15 : ప్రభుత్వ నిబంధనలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శాపంగా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేశారు. అయితే, ఇందిరమ్మ ఇండ్లు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలో ఉండాలని నిబంధన పెట్టడంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. తొలుత నచ్చిన కొలతల్లో కట్టుకోండి సర్కారు మాత్రం రూ.4 లక్షలు ఇస్తుందని అధికారులు చెప్పారని, తీరా బేస్మెంట్ పిల్లర్లు అయిన తర్వాత 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉంటే బిల్లులు రావని చెప్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గుండారానికి చెందిన పండుగు సత్తవ్వ భర్త విజయ్ 25 ఏండ్ల క్రితమే మృతి చెందాడు. చిన్న గుడిసెలో నివాసం ఉంటున్న ఆమెకు ఇల్లు మంజూరైంది. దీంతో బేస్మెంట్ పూర్తి చేసి పిల్లర్లు కూడా పోయించింది. తీరా అధికారులు బేస్మెంట్ కొలతలు చూసి 600 చదరపు అడుగులు దాటిందని, బిల్లు రాదని చెప్పడంతో ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బుకు కొంత అప్పు చేసి ఇల్లును పూర్తి చేసుకుంటామని, ఇప్పటికిప్పుడు దాన్ని తగ్గించమంటే ఎలా? అని ఆవేదన వ్యక్తంచేస్తున్నది. దీనిపై హౌసింగ్ ఏఈ హకీంను వివరణ కోరగా మొదట ఇందిరమ్మ ఇల్లు చుట్టు కొలత 400 చదరపు అడుగులుగా ఉంటే దాన్ని మార్చి 600 చదరపు అడుగులకు పెంచారని, ఇల్లు కట్టుకునే వారు నిబంధనల ప్రకారం నిర్మించాలని సూచించారు.