Palakurthy | పాలకుర్తి, నవంబర్ 2 : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పాలకుర్తి మండలం టీఎస్కే తండాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. శనివారం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే హాజరై ఒకటి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులను ఒకే గదిలో కూర్చొబెట్టి పాఠాలు బోధించారు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు 8 మంది మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయులు వంతులవారీగా విధులు నిర్వహిస్తున్నారని తండావాసులు చెబుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురే కానిస్టేబుళ్లు..
పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు ఉండగా, 23 మంది సిబ్బంది ఉండాలి. కానీ, ఇక్కడ ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. సిబ్బంది లేక 100 నంబర్‌కు ఫోన్ చేసినా స్పందించే వారే కరువయ్యారు. పోలీస్‌స్టేషన్‌లో సరిపోను సిబ్బంది లేక ఉన్న వారు ముప్పుతిప్పలుపడుతున్నారు.