హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : మైనారిటీ గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది అందుబాటులోకి తీసుకువస్తామని కొంతకాలంగా చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 8న నిర్వహించిన సమీక్ష సమావేశంలో 2026-27 విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఆదేశాలు వచ్చి పది రోజులు కావస్తున్నా ఈ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం భవనాలు కూడా గుర్తించలేదని మైనారిటీ సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మైనారిటీ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి సత్వరమే ప్రవేశాలు కల్పిస్తామని విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం అమలులో మాత్రం చేతులేత్తిసిందని మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు. గత గురువారమే ‘దోస్త్’ ఫస్ట్ ఫేజ్ పూర్తయిందని, సుమారు 50 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని గుర్తుచేస్తున్నారు. మరో 15 రోజుల్లో విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నందున వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరుపేద మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు డిగ్రీ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేలాది మంది ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ విద్యా ర్థులు ఎదురు చూస్తున్నారు. గురుకుల మైనా రిటీ డిగ్రీ కాలేజీలు లేక గతంలో వేలాదిమంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేశారు. ఈ ఏడాది సుమారు 8 వేల మంది మైనారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే కాలేజీలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడంతో వీరిలో చాలామంది అడ్మిషన్లు తీసుకోవచ్చని సంబురపడ్డారు. ఇతర కాలేజీల్లో చేరకుండా వేచిచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం మైనారిటీ డిగ్రీ కాలేజీల ఏర్పాటులో జాప్యం చేస్తే వీరంతా నష్టపోయే ప్రమాదం ఉంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి కనీసం ‘దోస్త్’ సెకండ్ ఫేజ్లోనైనా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.