మహబూబాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : ఈ వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం వెలువడనున్నట్టు మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ, శిశు సమక్షేమశాఖ మంత్రి సీతక్క శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం కొత్తగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వారంలోనే స్థానిక ఎన్నికలకు సంబంధించి నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నదని, కార్యకర్తలు సిద్ధంగా ఉండి రెండు మండలాల్లో క్లీన్ స్వీప్ చేయాలని సూచించారు. జూలై చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్కు మీడియాను రానీయకుండా ఇంటర్నల్ మీటింగ్లో ఈ విషయాలు మాట్లాడినట్టు సమాచారం.