హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సంతలో సరుకుల్లా ప్రభుత్వ భూములను అమ్ముకొంటున్నది. నిధుల వేట పేరుతో రేవంత్ సర్కార్ భూముల పందేరానికి పాల్పడుతున్నది. సంప్రదాయ ఆదాయ వనరుల ద్వారా వచ్చే రాబడి నానాటికీ క్షీణిస్తుండటంతో ప్రభుత్వ భూములు, ఆస్తుల మానిటైజేషన్ (నగదీకరణ), ల్యాండ్‌పూలింగ్, భారీ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన ఆదాయ వనరులుగా ఎంచుకున్నది. గడిచిన 30 నెలల్లోనే ప్రభుత్వం దాదాపు 20,000 ఎకరాల భూములను వేలం వేయడం, బదిలీ చేయడం, లీజుకు ఇవ్వడం లేదా తాకట్టు పెట్టడం వంటివి చేసింది. ఇదే వ్యూహంతో రాబోయే రోజుల్లో మరో ఐదువేల ఎకరాలను వేలం వేసేందుకు స్కెచ్ రెడీ చేసింది.
సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ఇక చివరకు భూముల విక్రయమే శరణ్యమనే స్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార నేతృత్వంలోని ‘ఆదాయ సమీకరణపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్-కమిటీ’ ఇటీవల అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ ఆస్తులు, భూముల నగదీకరణకు (మానిటైజేషన్) మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని స్పష్టంచేసింది. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ (హిల్ట్) ప్రాజెక్టును పట్టాలెకించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్-రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే సొంత ఆదాయ వనరులు (సంప్రదాయ ఆదాయం) దాదాపు స్తంభించిపోయింది. గడిచిన రెండేండ్ల బడ్జెట్లలో ప్రతిపాదించిన ఆదాయ లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయింది. పన్నుల వసూళ్లలో పారదర్శకత పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదని అధికారులు చెప్తున్నారు. మారెట్లో నెలకొన్న మందగమనం, పరిమితమైన నగదు చలామణి ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. 2024-25లో కేవలం 47%, 2025-26లో 79% రాబడి మాత్రమే వచ్చింది. 2023-24తో పోలిస్తే.. 2025-26 నాటికి రిజిస్ట్రేషన్ల ఆదాయం కేవలం రూ.వెయ్యి కోట్లలోపు పెరుగడం మారెట్ డీలా పడిందనడానికి నిదర్శనం.
రిజిస్ట్రేషన్ల ఆదాయం నిరాశపరిచినా, భూముల వేలం మాత్రం ప్రభుత్వానికి ఆశ కల్పిస్తున్నది. గతంలో చేపట్టిన ‘ఉప్పల్ భగాయత్’ ల్యాండ్‌పూలింగ్ విజయవంతం కావడంతో దానినే ఆదర్శంగా తీసుకొన్నారు. ఇటీవల రా యదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ప్రీమియం ప్లాట్ల వేలంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు పలికింది. దక్షిణ భారతదేశంలోనే ఇది సరికొత్త రికార్డు. మోకిలా, బుద్వేల్ పరిధిలో ఇప్పటికే వేలం ప్రక్రియ కొనసాగుతుండగా, మరో మూడు ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపకల మరిన్ని భూములను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంతోపాటు ‘హిల్ట్’ ప్రాజెక్టు ద్వారా భారీగా నిధులు రాబట్టాలని ప్రభుత్వం వ్యూహం రచిస్తున్నది. ఇప్పటివరకు లీజు ప్రాతిపదికన నడుస్తున్న పారిశ్రామిక భూములను ఆయా కంపెనీలకే పూర్తిగా విక్రయించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనివల్ల ప్రభుత్వానికి ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయి. అంతేకాకుండా, ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా దీర్ఘకాలిక లీజులకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పిండుకోవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.