హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేకుండా చేస్తున్న పనుల వల్ల ప్రజలపై పెనుభారం పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లు తాత్సారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత ఆగమేఘాల మీద మరమ్మతుల చేయిస్తున్నది. తాజాగా పాఠశాల పుస్తకాల (School Books) పంపిణీలో కూడా అదేవిధమైన పొరపాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్‌లు పంపిణీ చేశారు. అయితే వాటిని విద్యార్థుల నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
విద్యాశాఖ వాటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. ఇదికాస్త వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు టెక్ట్స్ బుక్స్‌ను వాపస్ తీసుకోవాలని పేర్కొంది. అయితే మళ్లీ వాటిని ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై స్పష్టతనివ్వలేదు. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్‌ను ఒక్క జతకే పరిమితం చేసిన ప్రభుత్వం.. తాజాగా ఇచ్చిన పుస్తకాలను వెనక్కి తీసుకోవడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఇటు విద్యార్థులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.