హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుపై వీఆర్వోలు భగ్గుమన్నారు. గ్రామపాలన అధికారులు(జీపీవో)ల జాబ్‌చార్ట్, నియామక అర్హతలపై ప్రభు త్వం శనివారం జారీచేసిన ఉత్తర్వులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వం వీఆర్వోల భవిష్యత్తును త్రిశంకు స్వర్గంలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ మేరకు టీవీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, సెక్రటరీ జనరల్ హరాలే సుధాకరరావు తాజా ఉత్తర్వులను ఖండిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పష్టత లేని జీవోలిస్తూ వీఆర్వోల భవిష్యత్తును సర్కారు ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యంగా తాజా ఉత్తర్వుల ప్రకారం గత సర్వీసుని పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టేనని మండిపడ్డారు. ఇక జీపీవోలుగా నియామకం కోసం అర్హతల పేరుతో పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు వీఆర్వోలను అవమానించడానికేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారుల కుట్రలో భాగంగానే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఆరోపించారు. ఉత్తర్వుల్లో గ్రామాల అకౌంట్స్ బాధ్యతచేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమబాట తప్పదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడి పని చేశామని, కానీ అధికారంలోకి వచ్చాక తామే బాధితులుగా మిగిలామని దుయ్యబట్టారు. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం చేతుల్లోనే తాము అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఉత్తర్వులను సవరించి వీఆర్వోల పూర్తి సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, ఎలాంటి పరీక్షలు లేకుండా అప్పటి వీఆర్వోలందర్నీ జీపీవోలుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఉత్తర్వులను సవరించకుండా ప్రభుత్వం అనాలోచితంగా ముందుకెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
జాబ్‌చార్ట్ జారీచేసిన ప్రభుత్వం
గ్రామాల్లో 10,954 మంది గ్రామ పాలన అధికారులు(జీపీవో)లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత వీఆర్వో, వీఆర్ఏలను జీపీవోలుగా నియమించేందుకు, వారి జాబ్‌చార్ట్‌కు సంబంధించిన విధివిధానాలపై శనివారం ప్రభుత్వం జీవో నంబర్ 129 జారీచేసింది. అపాయింట్మెంట్, అర్హతలు, విధుల గురించి ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారి నుంచి ఆప్షన్లు కోరనున్నది.