జగిత్యాల రూరల్, డిసెంబర్ 27: జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వృద్ధాశ్రమానికి సోమవారం రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమిపూజ నిర్వహించారు. వృద్ధాశ్రమాన్ని ఎకరం 25 గుంటల స్థలంలో అన్ని వసతులు, హంగులతో నిర్మిస్తామని వివరించారు. దీనికి కోటి రూపాయలు కేటాయించిన ప్రభుత్వం తొలి విడతగా రూ.50 లక్షలు మంజూరు చేసిందని చెప్పారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా తానే పర్యవేక్షిస్తానని అన్నారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగిస్తామని వెల్లడించారు. సేవా దృక్పథంతో నిర్మిస్తున్న ఆశ్రమంలో ఎవరైనా సేవలు అందించవచ్చునని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో మొదటిసారిగా ప్రభుత్వం వృద్ధాశ్రమాన్ని నిర్మించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ జీ రవి తదితరులు పాల్గొన్నారు.