పెద్దపల్లి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ‘ఈ తిట్లు పడలేం.. రాజకీయ ఒత్తిళ్లు భరించలేం.. అందుకే మేమిక్కడ పనిచేయలేము’ అని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఏకంగా మూకుమ్మడి సెలవులు పెట్టిన వైనం సంచలనంగా మారింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతతోపాటు ఇతర నాయకుల బూతు పురాణాలు, రాజకీయ ఒత్తిళ్లతో అర్బన్ మండలంలో పనిచేసేందుకు అధికారులు, సిబ్బంది భయంతో బెంబేలెత్తుతున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది మొత్తం సామూహిక సెలవులు పెట్టడం గమనార్హం. దీంతో రెవెన్యూ సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రామగుండం అర్బన్ మండల పరిధిలో కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎమ్మెల్యే, నగర మేయర్, మెజారిటీ కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని నగర ప్రజలు భావించారు.
కానీ, ఇక్కడ అర్బన్, మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)గా పనిచేయడానికి అధికారులు జంకుతున్నారు. తొమ్మిది నెలల క్రితం పూర్తిస్థాయి తహసీల్దార్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డీటీగా పనిచేస్తున్న శ్రీపాద ఈశ్వరప్రసాద్‌కు ఇన్చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న డీటీ లక్ష్మిని ఈశ్వరప్రసాద్ స్థానానికి డిప్యుటేషన్‌పై పంపారు. 22 రోజుల క్రితం ఈశ్వరప్రసాద్ పెద్దపల్లి కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడికి రావడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు డీటీగా పనిచేస్తున్న లక్ష్మి సైతం తిరిగి తన డిప్యుటేషన్‌ను రద్దు చేసుకొని ఈ నెల 4న పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికే వెళ్లారు. ఫలితంగా ఇక్కడ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
‘కరువమంటే కప్పకు కోపం.. వదలమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది రామగుండం అర్బన్, మండల తహసీల్దార్, డీటీ, ఇతర కార్యాలయ సిబ్బంది పరిస్థితి. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత, ఆయన అనుచరుల ఒత్తిళ్లను ఆయా అధికారులు భరించలేకపోతున్నారు. ప్రజల ముందు బహిరంగంగానే తిట్ల దండకాన్ని అందుకోవడం, ఫోన్లు చేసినప్పుడల్లా దుర్భాషలాడుతుండటంతో అవమానకరంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకొందామంటే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తమపై చేస్తున్న జులుం భరించలేక తాజాగా అంతా సామూహిక సెలవులపై వెళ్లారు.
రామగుండం అర్బన్ తహసీల్ కార్యాలయం తాజాగా మూతపడింది. ఇక్కడ తహసీల్దార్, డీటీ లేకపో గా.. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేక సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐ-1, ఆర్ఐ-2, వివిధ సెక్షన్ల ఇన్చార్జులు, జీపీవోలు, ఇతర సిబ్బంది సామూహికంగా సెలవులు పెట్టారు.
తహసీల్ కార్యాలయం మూతపడటంతో విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కులం, ఆదాయం, స్థిరనివాసం, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లు, జనన, మరణ, ధ్రువీకరణ పత్రాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సెస్సీ పరీక్షలు ముగుస్తుండగా, స్కాలర్షిప్ దరఖాస్తులు, పరీక్షలు, రెసిడెన్షియల్ ఇంటర్ ప్రవేశాలకు, పాలిటెక్నిక్ పరీక్షలకు సిద్ధమయ్యే వారంతా ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే తహసీల్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు, సిబ్బందిపై జరిగే రాజకీయ ఒత్తిళ్లను నివారించాలని సర్కార్ పెద్దలకు హితవు పలుకుతున్నారు.