హైదరాబాద్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): దాదాపు పదిరోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లకు రూ.984.41 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. 739 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతినగా, 200 చోట్ల కాజ్‌వేలు, కల్వర్టులకు నష్టం వాటిల్లింది. వరదల వల్ల 25 చోట్ల రోడ్లు కోతకు గురైనట్టు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.46 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.984 కోట్లు ఖర్చవుతుందని ఆర్అండ్బీ అధికారులు అంచనాలు రూపొందించారు.
కాగా, ప్రభుత్వం మాత్రం కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా ఇంకా నిధులు విడుదల చేయలేదు. ఆర్అండ్బీ పరిధిలో 37 రోడ్డు డివిజన్లు ఉండగా, ఇటీవలి వర్షాలకు 856 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట తదితర డివిజన్లలో అత్యధికంగా రోడ్లు పాడైపోగా, హనుమకొండ, మిర్యాలగూడ, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర డివిజన్లలో పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, వర్షాలు తగ్గుముఖం పట్టాక శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే, ప్రభుత్వం మాత్రం కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా ఒక్క పైసా విడుదల చేయలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన తుపాన్‌కు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లగా ఇంతవరకూ శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. నిధుల సమస్య కారణంగా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. దీనికితోడు ప్రభుత్వం కూడా సరిపడా నిధులు విడుదల చేయకుండా అరకొర నిధులతో నెట్టుకొస్తున్నది. ఈ నేపథ్యంలో, తాజాగా మరోసారి వర్షాలతో భారీ నష్టం జరగడం రాష్ట్ర సర్కారుకు గోటిచుట్టుపై రోకటిపోటు చందంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.6,478 కోట్లతో 373 రోడ్లను 5,190 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ రోడ్లకు ప్రభుత్వం 40%, మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్లు భరించాల్సి ఉన్నప్పటికీ మొత్తం నిధులు ప్రభుత్వమే దశలవారీగా చెల్లించేలా ప్రణాళికలు రూపొందించారు. కనీసం రోడ్ల మరమ్మతులకే నిధులివ్వని సర్కారు ఏకంగా రూ.6,478 కోట్లు ఎలా చెల్లస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం హ్యామ్ రోడ్ల పేరుతో కనీసం తాత్కాలిక మరమ్మతు పనులు కూడా చేపట్టడంలేదు. ఒకవైపు కాంట్రాక్టర్లు హ్యామ్ రోడ్లను వ్యతిరేకిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని రోగాలకూ ఒకటే మందు అనే చందంగా హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రోడ్ల స్వరూపం పూర్తిగా మారిపోతుందని చెప్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్ల భవితవ్యం ఏ విధంగా ఉంటుందో రానున్న కాలమే నిర్ణయించాలి.