హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పాలియేటివ్ కేర్ (ఉపశమన సేవలు)పై సమాజంలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సేవలు అందుబాటులోకి రావాల్సి ఉందని, ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని అన్నారు.
హైదరాబాద్ ఖాజాగూడలో ఏర్పాటుచేసిన స్పర్శ్ హాస్పైస్ కేంద్రానికి మంగళవారం మంత్రి ఎలక్ట్రిక్ వాహనాలను అందించారు. చివరి దశలో ఉన్న రోగులకు ఇంటి దగ్గర వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన కేంద్రం స్పర్శ్ హాస్పైస్ కాగా, రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో దాతలు ఈ వాహనాలను సమకూర్చారు.
ఈ కేంద్రానికి ఉచితంగా నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ఆదేశాలను మంత్రి జారీచేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.