TG Budget | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నేషనల్ హెల్త్ పాలసీ-2017 ప్రకారం మొత్తం బడ్జెట్లో 8శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ 4 శాతం నిధులే కేటాయించింది. ఆరోగ్యశాఖకు కేవలం రూ.12,393 కోట్లు బడ్జెట్ కేటాయించింది. నిర్వహణకు రూ.5667 కోట్లు, పథకాలకు రూ.6,726 కోట్లుగా పేర్కొంది. కేసీఆర్ హయాంలో నగరానికి నలువైపులా నిర్మాణం చేపట్టిన టిమ్స్‌ల కోసం తాజా బడ్జెట్లో రూ.837 కోట్లను మాత్రమే కేటాయించింది. వరంగల్‌లో కేసీఆర్ చేపట్టిన భారీ దవాఖానకు అరకొర నిధులతో సరిపెట్టింది. ఈ ఏడాది జూన్ 2 వరకు పెండింగ్‌లో ఉన్న దవాఖానల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నప్పటికీ బడ్జెట్లో ఆ మేరకు నిధులు కేటాయించలేదు. ప్రాథమిక వైద్యానికి బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాథమికఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లేనట్టేనని తెలుస్తున్నది.
కేసీఆర్ స్కీమ్స్ కొనసాగింపు ఊసేలేదు
కేసీఆర్ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కేసీఆర్ కిట్ పేరును మార్చి పథకాన్ని కంటిన్యూ చేయాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బడ్జెట్లో ఆ స్కీమ్ ప్రస్తావన తీయలేదు. దీంతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్స్‌కు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవమైతే ఆడ బిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ హయాంలో అందించేవారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పాటు అమ్మఒడి వాహనాల నిర్వహణకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేసీఆర్‌పై కక్షకట్టి, ఆరోగ్యశాఖలో ప్రజలకు ఉపయోగపడే చాలా సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.