Budget 2025 | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): చేనేత, పవర్లూమ్ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. చివరకు రూ.371 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో హ్యాండ్లూమ్ (చేనేత), పవర్లూమ్ కార్మికులు కాం గ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చేనేత, పవర్లూమ్ కార్మికులకు బీమా అమలు గురించి బడ్జెట్లో ప్రస్తావించకపోవడంతో ఆయా కార్మికులు సర్కారుపై ధీమా కోల్పోయారు. బీమా నిర్వహణ ఖర్చుల కోసం కేవలం రూ.15 లక్షలు కేటాయించి చేతులు దులుపుకొన్నదని హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికుల సంఘం నాయకులు చెరుకుస్వామి, కూరపాటి రమేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత కార్మికులకు రుణమాఫీ విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు.
పైగా లక్షకు రూపాయి ఎక్కువైనా చేనేత రుణమాఫీ చేసేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధిలేక రాష్ట్రంలో ఇప్పటివరకు 36 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక కుటుంబాలను వదిలి వలస పోయారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలోనూ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని కార్మికులు విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని, బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.