సిద్దిపేట, మే 12 : రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిన్నచూపు అని.. పంటలు కొనాలని రాష్ట్రమంతటా అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం బండచర్లపల్లిలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని ఆయన సం దర్శించి రైతులతో మాట్లాడారు. 15 రోజులైనా లారీలు రావడం లేదని రైతుల చెప్ప గా, వెంటనే ఆర్డీవోతో హరీశ్‌రావు ఫోన్లో మాట్లాడారు. లారీలను పంపి ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మిల్లర్లు సకాలంలో ధాన్యం దించుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు నెల రోజులుగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే సన్‌ఫ్లవర్, మక్కజొన్న, శనగ కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సీఎం మాటకు విలువ లేదా?
రైతుబంధు కోసం కండ్లల్లో వత్తులు వేసుకోని చూడాల్సి వస్తున్నదని హరీశ్‌రావు తెలిపారు. మార్చి 22న సిద్దిపేటకు సీఎం వచ్చినప్పుడు ఎకరాకు వేశారని, 45 రోజుల్లో పూర్తిగా వేస్తామని చెప్పి 52 రోజులు దాటినా దిక్కులేదని విమర్శించారు. బుస్సాపూర్ రైతు యాదయ్య మక్కలు విక్రయించేందుకు తెస్తే, గన్నీ బ్యాగులు ఇవ్వకుండా 20రోజులు కాంటా వేయలేదని, తీరా బయట సంచులు కొనుక్కొని తెస్తే అప్పుడు పెట్టారని మండిపడ్డారు. రైస్ మిల్లుకో అధికారిని నియమించి ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మళ్లీ కేసీఆర్ పాలన రావాలి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో హరీశ్‌రావు పర్యటించి ఉపాధి కూలీలు, రైతులను పలుకరించారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి ఆవుతారని రైతులు, ఉపాధి కూలీలు, చింతమడక ప్రజలకు హరీశ్ భరోసా ఇచ్చారు.