హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) :ఈ వివాదానికి కారణమైన మీడియా కథనాలకు ఆ సంస్థ ఎడిటర్‌తోపాటు, సంస్థ చైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందులో పనిచేసే ఉద్యోగులు కాదని, జర్నలిస్టుల అరెస్ట్‌లపై సర్కార్ సమాధానం చెప్పాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్(టీజేఎఫ్) ప్రెసిడెంట్ పల్లె రవికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను పల్లె రవికుమార్గౌడ్తోపాటు కార్యదర్శి మేకల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముద్దం స్వామి, వైస్ ప్రెసిడెంట్ పోగుల ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు.
ప్రజాపాలన పేరిట రేవంత్‌రెడ్డి సర్కార్ దశాబ్దాలుగా మీడియాలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులను అప్రజాస్వామ్య విధానంలో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బహుజన వర్గాలకు చెందిన జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ముగ్గురిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, మంత్రిపై ప్రసారమైన కథనాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు. రాజ్యాంగం చేతబట్టి దేశం అంతా పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ, జర్నలిస్టుల అరెస్ట్‌పై వెంటనే స్పందించాలని, వ్యక్తిగత వ్యవహారాలపై వచ్చే కథనాలను టీజేఎఫ్ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదని వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిని విడిచిపెట్టి అమాయకులను కేసులతో వేధింపులకు గురి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసుల దురుసు ప్రవర్తన అన్యాయం ;దవాఖాన నుంచి బలవంతంగా తీసుకెళ్లడం సరి కాదు: టీడబ్ల్యూజేఏ
ఎన్టీవీ జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అన్యాయమని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీడబ్ల్యూజేఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఆస శ్రీరాములు, ప్రధానకార్యదర్శి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతురమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్‌ను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. దవాఖానలో అందరూ చూస్తుండగానే సుధీర్ మెడపై చేతులు వేసి బలవంతంగా తీసుకువెళ్లడం సమంజసం కాదని పేర్కొన్నారు.
అభినందించిన నేతలే.. అరెస్టులు చేస్తున్నారు ; టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ రాములు
ప్రజల్లో జరుగుతున్న చర్చలను మాత్రమే మీడియాలో ప్రసారం చేస్తారే తప్పా.. మీడియా వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని టార్గెట్ చేయదని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ రాములు అన్నారు. మీడియా గతంలో పాలకులు, అధికారు లు చేస్తున్న వ్యతిరేక విధానాలను వెలికి తీసిందని, అప్పుడు అభినందించిన నేతలే.. ఇప్పుడు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.