బొడ్రాయిబజార్, జూన్ 10 : తమ కూతురి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం సూర్యాపేట దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన రత్నావత్ సైదులు, రమ్య దంపతుల కుమార్తె హరిస్మిత (17) టాన్సిల్స్‌తో బాధపడుతుండగా.. మే 20న సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో చేర్పించారు.
పరిశీలించిన డాక్టర్ ఆపరేషన్ అవసరమని చెప్పి అందుకు అవసరమైన పరీక్షలన్నీ చేశారు. మే 31న ఉదయం 9గంటలకు ఆపరేషన్ చేసేందుకు థియేటర్లోకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం అవుతున్నా ఆపరేషన్ గది నుంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు సదరు డాక్టర్‌ను కలిసి వివరాలు అడిగారు. అనస్థీషియా వేయడంతో అపస్మారక స్థితికి వెళ్లిందని, అందుకు చికిత్స చేసేందుకు ఇక్కడ సరైన సదుపాయాలు లేవని, గాంధీ దవాఖానకు వెళ్లాలని చెప్పగా వెంటనే తరలించారు. గాంధీ దవాఖానలో వైద్యం పొందుతున్న ఆ బాలిక స్పృహలోకి రాకుండానే ఈ నెల 4న మృతిచెందింది.
సదరు డాక్టరే తమ బిడ్డకు మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడం వల్లే మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. సదరు డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సోమవారం దవాఖాన ఎదుట ఆందోళన చేశారు. వీరి ఆందోళనకు సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు మద్దతు పలికారు. అనంతరం వీరు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణ కమిటీ వేసి నిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.