Housing Board | హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ) : అత్యంత విలువైన హౌసింగ్‌బోర్డు ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సంక్షేమ పథకాల అమలు కోసం బ్యాంకుల నుంచి తెస్తున్న రుణాలు సరిపోకపోవడంతో విలువైన భూములను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. హౌసింగ్‌బోర్డుకు చెందిన దాదాపు 600 ఎకరాల భూమి, సుమారు 300 దుకాణాలు విక్రయించే జాబితాలో ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) నుంచి ప్రభుత్వం వాపసు తీసుకున్న ఐదువేల ఎకరాలను కూడా విక్రయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. భూముల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నట్టు తెలిసింది.
పేద, మధ్య తరగతి వర్గాల కోసం హౌసింగ్ కాలనీలు అభివృద్ధిచేసి సరసమైన ధరలకు వాటిని విక్రయించే ఉద్దేశంతో ఏర్పాటైన హౌసింగ్‌బోర్డు.. కాలక్రమంలో తమ ఉనికి కోల్పోయింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో హౌసింగ్ కార్పొరేషన్, గృహకల్పను ఏర్పాటుచేయడంతో హౌసింగ్‌బోర్డు అలంకారప్రాయంగా మారింది. పేదల కోసం ఉచితంగా అందించే గృహాల నిర్మాణం కోసం హౌసింగ్ కార్పొరేషన్‌ను, మధ్యతరగతి వర్గాల కోసం గృహకల్పను ఏర్పాటుచేశారు. దీంతో ప్రస్తుతం కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఈసీఐఎల్, మౌలాలీ తదితర అనేక ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కాలనీలు హౌసింగ్‌బోర్డుకు గుర్తులుగా మిగిలాయి. హౌసింగ్‌బోర్డుకు సంబంధించి హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,609 ఎకరాలు ఉండగా, అందులో 3,820 ఎకరాల్లో ఇదివరకే కాలనీలు నిర్మించారు. మిగిలిన 789 ఎకరాల్లో దాదాపు 80 ఎకరాలపై కోర్టులో కేసులు ఉండగా, 610 ఎకరాలు క్లియర్‌గా ఉన్నది. ఇవికాకుండా 150 ఎకరాల భూమి లీజులకు ఇచ్చారు. ఇందులో సుమారు 100 ఎకరాలు జేఎన్టీయూకి, మిగిలింది వివిధ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చారు. ఇందులో కొన్ని భూములపై కోర్టులో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిధుల సమీకరణలో నిమగ్నమైన రాష్ట్ర సర్కారు దృష్టి హౌసింగ్‌బోర్డు ఆస్తులపై పడింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆస్తుల వివరాలు, ప్రస్తుతం వాటి స్థితి తదితర వివరాలతో కూడిన నివేదికను అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి అందించారు. భూముల ధరలు, నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడంతోపాటు రాజీవ్ గృహకల్ప ఇండ్లలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం ఇండ్లను నిర్మించి విక్రయించడం కన్నా భూములను విక్రయించడానికే మొగ్గు చూపుతున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హౌసింగ్‌బోర్డుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఎంజేరోడ్, మహబూబ్‌గంజ్, బషీర్పల్లి, విజ్ఞాన్‌పురి, వెంగళరావునగర్, బర్కత్‌పుర తదితర ప్రాంతాల్లో 300 దుకాణాలు ఉండగా, అనేక ఏండ్లుగా అద్దెల సవరణ జరగకపోవడంతో వాటిపై నామమాత్రంగా ఆదాయం వస్తున్నది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 2005లో అప్పటి ప్రభుత్వం ఈ దుకాణాలను విక్రయించాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం 11 దుకాణాలను విక్రయించగా, వివిధ కారణాలతో మిగిలిన దుకాణాల విక్రయం నిలిచిపోయింది. ఎలాగూ వీటిపై పెద్దగా ఆదాయం రావడంలేదు కాబట్టి భూములతోపాటు వీటిని కూడా విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. వీటితోపాటు హౌసింగ్‌బోర్డుకు సంబంధించి గృహకల్ప, గగన్‌విహార్, చంద్రవిహార్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు, మనోరంజన్ కాంప్లెక్స్, తుల్జాగూడ కాంప్లెక్స్, ఎస్ఆర్నగర్ కాంప్లెక్స్ తదితర భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. వీటిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలకు అద్దెలకు ఇచ్చారు. వీటిపై ప్రస్తుతం నెలకు రూ.మూడు కోట్లవరకూ అద్దెలు వస్తుండగా, అవి ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఉండటంతో క్రమం తప్పకుండా అద్దెలు వస్తుండటంతో ఉద్యోగుల జీతభత్యాలకు లోటు లేకుండా ఉన్నది. అయితే, ఇందులోనూ కొందరు దుకాణదారులు కోర్టులో కేసులు వేసి అద్దెలు ఇవ్వడంలేదని ఉద్యోగులు చెప్తున్నారు.
కంపెనీస్ చట్టం కింద 2007లో దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్-డీఐఎల్ఎల్)ను అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సమీకృత టౌన్‌షిప్‌ల నిర్మాణం, పీపీపీ కింద జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపట్టే ఉద్దేశంతో దీనిని ఏర్పాటుచేశారు. దిల్ కింద తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 6,800 ఎకరాల భూములు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 150 ఎకరాల భూములు ఉండేవి. అందులో 1,890 ఎకరాలను వివిధ ప్రాజెక్టుల కోసం వినియోగించడమో, విక్రయించడమో జరగగా, 5000 ఎకరాలు దిల్ ఆధీనంలో ఉండేవి. ఈ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో జీవో ద్వారా వెనక్కు తీసుకున్నది. ఈ భూములను కూడా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. దిల్ నుంచి తెలంగాణ సర్కారు వాపసు తీసుకున్న 5000 ఎకరాల భూముల విలువ రూ.70వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.