Civil Supplies | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాలశాఖలో ప్రభుత్వ పెద్దలు, అధికారుల అనాలోచిత నిర్ణయాలతో సర్కారుకు వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి కోసం నష్టం భరించాలని ఆ శాఖలోని అధికారుల నుంచే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే 2022-23 యాసంగి సీజన్‌కు 38 లక్షల టన్నుల ధాన్యం విక్రయించేందుకు 2024 జనవరి 25న పౌరసరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్లలో పాల్గొని దక్కించుకున్న వారికి ఫిబ్రవరి 23న సమ్మతి పత్రాలను అందించింది. మూడు నెలల్లో మొత్తం ధాన్యాన్ని తీసుకెళ్లాలని నిబంధనల్లో పేర్కొంది. కానీ ఇప్పటికే 385రోజులు గడిచింది. బిడ్డర్లు కేవలం 18 లక్షల టన్నులు ధాన్యం మాత్రమే తీసుకెళ్లారు. 20 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతున్నది. ఏడాది పూర్తయిన బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోవడం, ప్రభుత్వ పెద్దలు చూస్తూ ఊరుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వడ్డీనే వెయ్యి కోట్లు నష్టం !
ధాన్యం టెండర్ వల్ల పౌరసరఫరాల సంస్థకు భారీ నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ధాన్యం విలువ సుమారు రూ.7వేల కోట్లుగా పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. బిడ్డర్లు రూ. 3300 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే తీసుకెళ్లగా సుమారు రూ. 3700 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ఉండడం గమనార్హం. ధాన్యం ఎత్తడంలో ఆలస్యంతో ఇప్పటివరకు రూ.1000 కోట్ల వడ్డీ భారం పౌరసరఫరాల సంస్థపై పడిందని అధికారులే చెప్తున్నారు. మరోవైపు బిడ్డర్లపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నాతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని పౌరసరఫరాల సంస్థలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ గడువు పొడగింపునకు నిరాకరణ
టెండర్ ధాన్యం పరిస్థితిపై గందరగోళం నెలకొన్నది. మిగిలిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు గడువు పొడగించేందుకు క్యాబినెట్ నిరాకరించినట్టు తెలిసింది. గడువు పెంపునకు ఆమోదం లభిస్తుందని ఆశించిన కొందరు సర్కారు పెద్దలకు, అధికారులకు, బిడ్డర్లకు నిరాశే ఎదురైందనే చర్చ నడుస్తున్నది. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిన తర్వాత గడువు పొడగించినా పొడగించకపోయినా ఉపయోగంలేదని, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికారులు చెప్తున్నారు.