Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం.. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా తెలంగాణతో పాటు పలు రాష్ర్టాలు ఉలిక్కిపడతాయి. ఇప్పుడే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సైతం ఈ మినీ భారతంలో చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఇతర ప్రాంతాల్లోని కోట్ల మంది ఆందోళన చెందుతారు. అలాంటిది.. నిన్నటిదాకా సినిమాల్లోనే చూసిన దృశ్యాలు గురువారం నగర రోడ్లపై కనిపించాయి. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రా ఫ్యాక్షనిజం ఛాయలు అందరినీ కలవరపరిచాయి. అత్యంత సురక్షితమైన ప్రాంతంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పదుల సంఖ్యలో వాహనాల ఫుట్‌బోర్డుపై కొందరు నిలబడి తొడగొడుతూ వెళ్లి ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయటం అందరినీ నివ్వెరపరిచింది. సగటు వ్యక్తి దీనిని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు ఇది డ్యామేజ్‌గా భావించాడు. ఆందోళన పడ్డాడు. అధికారంలో ఉన్న పెద్దలు మాత్రం దీనిని రాజకీయ వినోదంగా చూశారు.
సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో ఇది బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం, తమకేం సంబంధం అని అభిప్రాయపడ్డారు. అంటే రాజకీయ నేతగా ఆయన రాజకీయ కోణంలోనే చూశారే తప్ప సీఎం హోదాలో పరిణామాలను విశ్లేషించుకోలేదు. పర్యవసానంగా ‘చట్టం తన పని తాను’ చేయలేకపోయింది. యధా రాజా.. తథా ప్రజా అన్నట్టు రాజకీయ కోణంలోనే వ్యవహరించింది. అందుకే కొండాపూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని నిర్భంధించిన చట్టం.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీని మాత్రం కట్టడి చేయలేకపోయింది.
అధికారంలో ఉన్నామన్న వాస్తవాన్ని మరిచి
రాజకీయ కోణంలో కాంగ్రెస్ ఇదే కోరుకోవచ్చు. కానీ ఆ పార్టీ అధికారంలో ఉన్నదనే వాస్తవాన్ని గుర్తించకపోవడంతో హైదరాబాద్ ఒక్కసారి అభద్రతకు లోనైంది. అంతర్జాతీయంగా భౌగోళికంగానే కాదు.. శాంతిభద్రతలపరంగా ఎవరెస్టులాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కుప్పకూలిపోయింది. ఈ సత్యాన్ని పాలకులు గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిన్నటిదాకా అనేక ప్రశంసలు అందుకున్న పోలీస్‌శాఖ.. ‘వైఫల్యం’ అనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో రాత్రికి రాత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బోధపడింది. శుక్రవారం ఉదయం నుంచే నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. తమ కండ్ల ముందే గురువారం అరికపూడి గాంధీ వర్గీయులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా ప్రేక్షకపాత్ర పోషించిన పోలీస్ శాఖ.. ‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే’ కఠినంగా వ్యవహరిస్తామంటూ హూంకరించింది. అన్నింటికీ మించి నిన్నటిదాకా రాజకీయ కోణంలోనే పరిణామాల్ని విశ్లేషించిన సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే ఊరుకోం అంటూ హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పదేండ్లలో ఒక్క దుర్ఘటన లేదు
ఉమ్మడి ఏపీ పాలనలో హైదరాబాద్‌లో అనేక పర్యాయాలు కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒక దశలో సీఎం కుర్చీ కోసం శాంతిభద్రతలనూ ఫణంగా పెట్టిన దాఖలాలు ఉన్నాయి. 4 సార్లు ఉగ్రవాదుల బాంబుపేలుళ్లు జరిగాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం కోణంలోనూ హత్యలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో చిన్న దుర్ఘటన కూడా చోటుచేసుకోలేదు. అటు ఫ్యాక్షనిజం.. ఇటు ఉగ్రవాదం.. ఏ కోణంలో కూడా ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందుకే హైదరాబాద్ నగరం సురక్షిత నగరంగా పేరొంది అంతర్జాతీయ కంపెనీలు క్యూ కట్టాయి. ఐటీ రంగంలో సేఫెస్ట్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడటంతో ఐటీ రంగ ఉత్పత్తులు ఐదు రెట్లు పెరిగాయి.
9 నెలల్లో తలకిందులు
9 నెలల కాలంలోనే హైదరాబాద్ శాంతిభద్రతల్లో భారీ మార్పు.. నడిరోడ్డుపై హత్యలు పెరిగిపోయాయి. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ప్రవేశించాయి. సీఎం రేవంత్ కూడా తన సమీక్షలో నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా వరకు ఘటనలు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి. సైబరాబాద్ పరిధిలో పెద్దగా సంఘటనలు చోటుచేసుకోలేదు. గురువారం చోటుచేసుకున్న సంఘటన మాత్రం ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. పదుల సంఖ్యలో వాహనాల్లో వెళ్లి ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయటమంటే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటన్న సందేహం వచ్చింది.
మీడియాలో లైవ్ కవరేజీతో వెళ్లి దాడి చేయటం, పోలీస్ బలగాలు ఉన్నా దాటుకొని వెళ్లటం.. పోలీస్‌శాఖ వైఫల్యమేనని తేలిపోయింది. గురువారం రాత్రి దాకా ఈ పరిణామాల్ని రాజకీయ వినోదంలా ఆస్వాదించిన ప్రభుత్వ పెద్దలు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందనే వాస్తవాన్ని గుర్తించలేకపోయారు. నష్టం జరిగిపోయిన తర్వాత నిజాన్ని తెలుసుకున్నారు. దాంతో శుక్రవారం శాంతిభద్రతల కోణంలో హడావుడి మొదలైంది. రాత్రికిరాత్రి బ్రాండ్ ఇమేజ్ గుర్తుతెచ్చుకున్న రేవంత్ సర్కారు.. తెల్లారేసరికి స్టాండ్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.