Bhu Bharathi | హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రైతులు వ్యవసాయ భూములు అమ్మాలన్నా, కొనాలన్నా ‘భూ సర్వే’ తప్పనిసరి చేయాలన్న నిబంధనపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూ భారతి బిల్లులో భాగంగా ఈ నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భూమిని అమ్మే సమయంలో ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి, ఆ మ్యాప్‌ను రెవెన్యూ అధికారులకు అప్పగించాలని నిబంధన విధించింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నిబంధన రైతుల పాలిట గుదిబండగా మారుతుందని నిపుణులు మండిపడ్డారు. రైతు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని, అవినీతి పెరిగిపోతుందని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే రైతులు భూ సర్వే చేయించుకునేందుకు నెలలపాటు ఎదురుచూడాల్సి వస్తున్నది. పని పూర్తి కావాలంటే పై అధికారులతో, నేతలతోనో పైరవీలు చేయించాల్సి వస్తున్నది. అయినా ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనతో లంచాలకు తోడు, సర్వే కోసం అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుందని, ఇది అనవసర ఖర్చు అని రైతుల వాదన.
మరోవైపు రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీ వ్రంగా ఉన్నది. రాష్ట్రంలో 612 రెవెన్యూ మం డలాలు ఉండగా, 250 మంది వరకు మాత్ర మే సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం మండలాల్లో సగటున రోజుకు 5-10 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో సర్వేయర్ రోజుకు 15 భూముల సర్వే చేయాల్సి వస్తుం ది. ఇది అసాధ్యమని ప్రభుత్వ సర్వేయర్లే చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పూర్వ వీఆర్వో లు, వీఆర్ఏల నుంచి వెయ్యి మందిని సర్వేయర్లుగా నియమించాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆప్షన్లు సైతం స్వీకరించింది. అయితే.. ఈ ప్రతిపాదనను నిరుద్యోగులు, ప్రభుత్వ సర్వేయర్లు వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం సాంకేతిక కోర్సులు చేసినవారే అర్హులని స్పష్టం చేస్తున్నారు.
సర్వేతో కొత్త సమస్యలు తెరమీదికి రావడంతోపాటు, క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఆదాయం తగ్గుతుందని, ఇది రియల్ ఎస్టేట్ రంగంపైనా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించినట్టు సమాచారం. సర్వేయర్ల నియామకం, ఈ నిబంధనతో కలిగే లాభాలను రైతులకు వివరించిన తర్వాతే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.