హైదరాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడంతో 15 రోజులుగా రాజకీయాలను కుదిపేస్తున్న హిల్ట్ పాలసీ పురోగతి అయోమయంలో పడింది. ఇచ్చిన హామీని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రభుత్వ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.
ఫీజు చెల్లింపులో గందరగోళం..
కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగురోడ్డు వెలుపలికి తరలించాలనే ఉద్దేశంతోనే హిల్ట్‌పాలసీని ప్రవేశపెట్టినట్టు ఉత్వర్వుల్లో పేర్కొన్న సర్కారు, ఆరు నెలల్లోగా దరఖాస్తు చేసుకున్నవారికే ఈ పాలసీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎస్ఆర్వో రేటులో 30-50శాతం(రోడ్డు వెడల్పునుబట్టి) వరకు ఇంపాక్ట్ ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తుతోపాటు 20శాతం ఫీజు చెల్లిస్తే, మిగిలిన 80 శాతం దరఖాస్తు అప్రూవ్ అయ్యాక చెల్లించేందుకు వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకున్న 7 రోజుల్లో ప్రాథమిక పరిశీలన పూర్తవుతుందని, వారంలో అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలుపుతుందని స్పష్టం చేశారు. మిగిలిన 80 శాతం ఫీజు 45 రోజుల్లో రెండు వాయిదాల్లో చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇప్పుడు కోర్టు హెచ్చరికతో అంతా గందరగోళంగా మారింది.
ప్రత్యామ్నాయం చూపకుండానే తరలింపా?
పారిశ్రామికవాడల్లో పరిశ్రమలన్నీ తరలించేవరకు కన్వర్షన్ జరుగదని ఈ పాలసీలో ఎక్కడా పేర్కొనలేదు. హిల్ట్పాలసీకి దరఖాస్తు చేసుకోవాలా.. లేదా అనేది పూర్తిగా పరిశ్రమ యజమానుల ఐచ్ఛికమని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించగా, అదీ ఉత్తర్వుల్లో ఎక్కడా లేదు. కానీ, ఉత్తర్వులు వెలువడిన మరుసటి రోజునుంచే కాలుష్య నియంత్రణ మండలి నుంచి అన్ని పరిశ్రమలకు గంపగుత్తగా తరలింపు నోటీసులు జారీచేయడం గందరగోళానికి దారి తీసింది. ప్రభుత్వం తాజాగా కోర్టుకు ఇచ్చిన హామీ ప్రకారం, పరిశ్రమలన్నీ తరలించేవరకు కన్వర్షన్ చేసే అవకాశంలేదు.
అసంపూర్ణంగా సమావేశం
దరఖాస్తు చేసుకొని 20 శాతం ఫీజు చెల్లించేవారి పరిస్థితి అయోమయంలో పడుతుంది. పరిశ్రమ భూములను కన్వర్షన్‌కు వీలు కల్పిస్తున్నట్టు మాత్రమే జీవోలో పేర్కొన్నట్టు, ఎక్కడా పరిశ్రమలకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామనే ప్రస్తావన జీవోలో లేదని విచారణలో కోర్టు వ్యాఖ్యానించింది. పాలసీని ప్రవేశపెట్టేముందు కొందరు పారిశ్రామికవేత్తలను పిలిచి అధికారులు మాట్లాడగా, వారు ప్రత్యామ్నాయ భూములు కేటాయిస్తే తరలింపునకు సిద్ధమని స్పష్టం చేశారు. భూములు మీరే వెతుక్కోవాలని ప్రభుత్వం సూచించడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసినైట్టెంది.
హిల్ట్‌పై నీలినీడలు
ఊహించని విధంగా హిల్ట్‌పై రాజకీయ రగడ చోటుచేసుకోవడం, వ్యవహారం కోర్టుకు చేరడంతో పాలసీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నైట్లెంది. కోర్టుకి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం పూర్తిగా పరిశ్రమలు తరలించేవరకు కన్వర్షన్‌పై ముందుకెళ్లే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దరఖాస్తులు, ఫీజులు, కన్వర్షన్‌కు సంబంధించి సమగ్ర వివరాలు జీవోలో ఉన్నా పరిశ్రమలన్నీ తరలించేవరకు కన్వర్షన్ చేయమనే విషయం ఎక్కడా ఉత్తర్వుల్లో పేర్కొనకపోవడం సరికాదంటున్నారు. సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే పరిశ్రమవర్గాలు ఇబ్బందుల్లో పడతాయని పేర్కొంటున్నారు.
కొరవడిన స్పష్టత
ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీపై జీవో-27ని నవంబర్ 22న జారీచేసిన విషయం విదితమే. పాలసీని సవాల్‌చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ‘పరిశ్రమలన్నింటినీ తరలించేవరకు కన్వర్షన్ జరుగదని కోర్టుకు హామీ ఇచ్చారు. పారిశ్రామికవాడలనుంచి అన్ని పరిశ్రమల తొలగింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదు. అన్ని పరిశ్రమలను తరలించేవరకు ల్యాండ్ కన్వర్షన్ జరుగదు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో-20ని కచ్చితంగా అమలుచేస్తాం. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సవరించి ముందుకెళ్తాం’ అని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా, ఏజీ కోర్టుకు ఇచ్చిన హామీని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఇంకెప్పుడు మాటమార్చేందుకు అవకాశం లేకుండా పోయింది.