Pharma City | యాచారం, ఏప్రిల్ 3: కంచె గచ్చిబౌలి భూముల నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల్లో అడుగుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో సర్వే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలున్నప్పటికీ గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు రీసర్వే మొదలుపెట్టారు. సుమారు 200 మంది పోలీసుల రక్షణలో అధికారులు పనులు చేపట్టారు. దీంతో యాచారం మండలం మేడిపల్లి గ్రా మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోర్టు విధించిన స్టే ఇంకా అమలులో ఉండగా హద్దురాళ్లు ఎలా పాతుతారంటూ ఆ యా భూములకు చెందిన రైతులు అధికారులకు అడ్డుపడ్డారు. కోర్టు స్టే ఉన్న భూములను సర్వే చేయబోమని చెప్పిన అధికారులు మళ్లీ ఎందుకు వచ్చారని నిలదీశారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులు అడ్డు తొలిగేందుకు నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా పలువురిని అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులకు మద్దతుగా ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులు, బీఆర్ఎస్ నేతలు నిలిచారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పనులు చేపట్టొద్దని వారు మొండికేశారు. దీంతో పోలీసులు ఆర్డీవోకు స మాచారం ఇవ్వడంతో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అక్కడికి చేరుకున్నారు.
మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన భూముల రీ సర్వే జరిపేందుకు రెవెన్యూ, టీజీఐఐసీ, పోలీసు అధికారులు గురువారం ఉదయమే చేరుకున్నారు. గ్రామ శివారులో ఉన్న 67 సర్వే నంబర్లో భూముల హద్దులు గుర్తించి, కంచె వేసేందుకు ప్రయత్నించారు. అడిషనల్ డీజీపీ వెంకట సత్యనారాయణ, ఏసీపీ కేపీవీ రాజు, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సమక్షంలో పోలీసుల పహారాలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ సిబ్బంది హద్దులను గుర్తించారు.
హిటాచి, జేసీబీలతో భూములు చదును చేస్తూ గోతులు, కందకాలు తీసి పిల్లర్లు వేయడం వంటి పనులను ప్రారంభించారు. ఇంతలోనే ఆ భూమికి చెందిన రైతు కలకొండ జంగయ్య అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకున్నాడు. ‘మా భూమికి సంబంధించి కోర్టులో స్టే ఉన్నది. అలాంటిది మా భూమిలో హద్దురాళ్లు ఎలా పాతుతారు?’ అని ప్రశ్నంచాడు. ‘మీ కాళ్లు మొక్కుతా మా భూమిని సర్వే చేయొద్దు, మా భూమికి కంచె వేయొద్దు’ అని పోలీసులను బతిమిలాడాడు. అయినప్పటికీ అధికారులు పనులు కొనసాగించడంతో జంగయ్య వెళ్లి అడ్డుపడ్డాడు.
పోలీసులు అతడిని బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామస్తులు, రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు స్టే ఉన్న భూములను సర్వే చేయమని చెప్పిన అధికారులు మళ్లీ వచ్చి హద్దులు ఎలా వేస్తున్నారని, వేసిన హద్దులను వెంటనే తొలగించాలని పట్టు పట్టారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులు కానమోని గణేశ్, సందీప్‌రెడ్డి, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పాచ్ఛ భాష, రమేశ్, సాయికుమార్, ప్రవీణ్, సుధాకర్ తదితరులు అక్కడికి చేరుకొని రైతులకు అండగా నిలిచారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అక్కడికి చేరుకున్నారు. కోర్టు కేసు ఉన్న భూమిలో హద్దులు ఎలా పా తుతున్నారని రైతులు ఆర్డీవోను ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను రైతులు ఆయనకు చూపించారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతుల భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు. కోర్టు స్టే ఉన్న భూమిలో వేసిన హద్దురాళ్లను తొలగించి, కందకాలను పూడ్చాలని డిమాండ్ చేశారు. ఆ భూములను వెంటనే ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశా రు. అప్పటివరకు 2,200 ఎకరాల భూముల వద్దకు రావొద్దని తేల్చి చెప్పారు. దీంతో ఫార్మా కోసం సేకరించిన భూములకు మాత్రమే కంచె వేస్తామని, కోర్టు స్టే ఉన్న భూములకు ఆపేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోయిన రైతులందరికీ ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లు ఇచ్చేంతవరకూ అధికారులు భూముల జోలికి రావొద్దని రైతులు హెచ్చరించారు. సర్టిఫికెట్లు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయించాలని కోరారు. దీంతో ఆర్డీవో అనంతరెడ్డి కల్పించుకొని ప్లాట్ల విషయం కలెక్టర్‌తో చర్చించామని, పది రోజుల్లోగా డ్రా తీసి లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలిపారు. ప్లాట్లు కేటాయించిన వెంటనే రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. పరిహారం తీసుకున్న భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో పంటల సాగు చేపట్టొద్దని ఆయన రైతులకు సూచించారు. ప్లాట్లు కేటాయించే వరకు భూములను సాగు చేసుకుంటామని రైతులు స్పష్టంచేశారు.
భూముల రీ సర్వే, హద్దుల గుర్తింపునకు అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో వచ్చారు. మహేశ్వరం డీసీపీ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ వెంకటసత్యనారాయణ ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 187 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. సర్వే వద్దకు, అధికారులు చేపడుతున్న పనుల వద్దకు ఎ వ్వరూ వెళ్లకుండా పోలీసులు నిఘా ఉంచారు. హద్దురాళ్ల గుర్తింపు పనులను ఏసీపీ రాజు దగ్గరుండి పర్యవేక్షించారు.
మేడిపల్లి గ్రామానికి చెందిన గౌర పార్వతమ్మ అనే వృద్ధురాలు గ్రామంలో పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘ఫార్మాసిటీ పాడుగాను, ఆ రేవంత్‌రెడ్డి సర్కార్ పాడుగాను మా కొంపలు ముంచింది. మాకు భూములు లేకుండా చేసింది’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘మా ఊళ్లో ఫార్మాసిటీ పెట్టొద్దు. ఇవ్వని భూముల జోలికి సర్కారోళ్లు రావొద్దు’ అంటూ ఆమె పోలీసులకు మొరపెట్టుకున్నారు.
కోర్టు స్టే ఉన్న భూముల జోలికి రామని చెప్పిన అధికారులు అవే భూముల్లో హద్దురాళ్లు పాతడం ఎంతవరకు సమంజసం. కోర్టు తీర్పు వచ్చే వరకు భూముల జోలికి రావొద్దు. ప్రాణం పోయినా ఫార్మాసిటీకి భూములివ్వం. హద్దురాళ్లు పాతవద్దని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరించి, అక్రమంగా అరెస్టు చేయడం సరికాదు. ప్రభుత్వం మాట మీద నిలబడి రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించాలి.
– రైతు కలకొండ జంగయ్య, మేడిపల్లి