హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతున్నాయి. అధికార, పోలీసు యంత్రాంగం ఈ కబ్జాలపర్వాల్లో ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం తెరవెనుక సర్కార్‌లోని పెద్దోళ్లు ఉన్నారనేందుకు బలం చేకూర్చుతున్నది.
అయితే మొన్న గోపనపల్లి భూముల వ్యవహారమైనా, నిన్నటి కొత్వాల్‌గూడ, తాజా నాదర్గుల్ భూములైనా.. అన్నింటిలోనూ ప్రభుత్వ భూములు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఇది రెవెన్యూ శాఖ పరిధిలో అంశమైనందున కచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించాల్సిన అవసరముంటుందని సీనియర్ రిటైర్డ్ సివిల్ సర్వీసు అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే మూడుచోట్లా భూముల విలువ వేల కోట్లల్లో ఉన్నందున ప్రజలకు చెందాల్సిన భూముల వ్యవహారంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్‌పైనే ఉంటుందని తేల్చిచెబుతున్నారు. కానీ అన్ని సందర్భాల్లోనూ కలెక్టర్ నారాయణరెడ్డి నుంచి ప్రజలకు నిరాశే ఎదురైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ మూడు వ్యవహారాల్లో అత్యంత కీలకమైనది కొత్వాల్‌గూడలోని మంత్రి పొంగులేటి అక్రమ క్రషర్ వ్యవహారం. ప్రభుత్వ భూముల్లో అక్రమ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయిలోనూ సందర్శించి, వాస్తవాల్ని వెల్లడించింది. చివరకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఏకంగా అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. దిమ్మతిరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అక్రమ క్రషర్ ఏకంగా 350 ఎకరాల ప్రభుత్వ భూమితో ముడిపడి ఉన్నది. అయినప్పటికీ రెవెన్యూ శాఖ నుంచి కించిత్ వివరణ, సమాచారం గానీ ప్రజలకు వెలువడలేదు.
గోపనపల్లి సర్వే నంబర్ 36 విషయంలో సాక్షాత్తూ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో 17.04 ఎకరాలు అని పేర్కొనగా, క్షేత్రస్థాయిలో మాత్రం 40 ఎకరాలకు పైగా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి వెంచర్ వేశారు. దీనిపైనా కలెక్టర్ గానీ ఆర్డీవో, తహసీల్దార్ నుంచి స్పష్టత ఉండదు. ఇక నాదర్గుల్ భూముల వ్యవహారమైతే రాష్ట్రవ్యాప్తంగా అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. నిషేధిత జాబితాలో ఉన్న 373.22 ఎకరాల చుట్టూ ప్రైవేట్ కంపెనీలు రేకుల ఫెన్సింగ్ వేసి తమ భూముల్లోకి పోతున్న రైతుల్ని బౌన్సర్లతో బెదిరించి వెనక్కి పంపుతున్నా స్పందించే దిక్కు లేదు. చివరకు రైతులు తహసీల్దార్ నుంచి ఆర్డీవో, కలెక్టర్, హైడ్రా, పోలీస్‌స్టేషన్ ఇలా ఫిర్యాదు చేయని వేదిక అంటూ లేదు. మరోవైపు ఒక్కొక్కటిగా ప్రైవేట్ కంపెనీలు అక్కడ తిష్ట వేస్తున్నా కలెక్టర్‌కు పట్టింపులేదు.
ఈ పరిణామాలపై కలెక్టర్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో కిందిస్థాయి అధికారుల్లోనూ గందరగోళం నెలకొన్నది. కండ్లముందు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు మౌనంగా ఉంటుండటంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. కొత్వాల్‌గూడ క్రషర్ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ ఆర్డర్ ఇచ్చినా తహసీల్దార్ అటువైపు వెళ్లేందుకే జంకుతున్నారంటే భరోసా ఇవ్వాల్సిన కలెక్టర్ ఆ మేరకు ఆదేశాలు ఇవ్వకపోవడమే కారణమనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారుల ఆదేశాల లేకపోవడంతో వారు అభద్రతాభావానికి గురవుతున్న ఫలితంగానే ప్రభుత్వ భూముల కబ్జాపై చర్యలు ఉండటం లేదని తెలుస్తున్నది.
ఇక వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుమారుడి నిర్మాణ కంపెనీపై కేసు నమోదైన ఘటనలో నిక్కచ్చిగా పనిచేసిన ఇన్స్పెక్టర్ చివరికి బదిలీ వేటుకు గురయ్యారు. ఉన్నతాధికారులు భరోసా ఇస్తే కిందిస్థాయి అధికారులు ఇలా బలవకుండా ఆత్మైస్థెర్యం పెరిగేది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో నిజాయితీగా వ్యవహరించాలనుకున్న అధికారులూ ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు.
ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనేందుకు బడంగ్‌పేట వ్యవహారమే ఉదాహరణగా పలువురు చెబుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అధికారులు, తెరవెనుక అండగా నిలిచిన రాజకీయ నేతలు.. వీటన్నింటినీ లెక్క చేయకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. గ్రేటర్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి పది మంది ఉద్యోగులు… అందులో ఒక డిప్యూటీ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేయడమంటే అవినీతి అధికారులకు హెచ్చరికతో పాటు నిజాయితీ అధికారులకు తమ మార్గం సరైనదేనన్న భావన కల్పించినట్టయిందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నట్టు అనేక కథనాలు వెలువడుతున్నా కలెక్టర్ గానీ ఇతర రెవెన్యూ అధికారులు గానీ స్పందించడం లేదు. కానీ కొన్నిరోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’లో మూసీ సుందరీకరణలో భాగంగా అధికారుల నిర్ధారిస్తున్న హద్దులను పరిశీలిస్తే వేలాది ఇండ్లు భూసేకరణ జాబితాలోకి వచ్చే ప్రమాదమున్నదని కథనం ప్రచురితమైంది. కేవలం గంటల వ్యవధిలోనే స్పందించిన రెవెన్యూ అధికారులు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి ఆ కథనంలో చెప్పినట్టు వేల ఇండ్లుపోవంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. పనిలో పనిగా అనధికారికంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్లకు ఫ్లాటుకు ఫ్లాటు ఇచ్చేందుకు ఒక నిర్మాణ సంస్థకు చెందిన 11టవర్లను సైతం పరిశీలిస్తున్నామని లీకులు ఇచ్చారు. మరి ఒక అంశంలో ఉన్న శ్రద్ధ.. సర్కార్ పెద్దలే కొల్లగొడుతున్న సమయంలో ఉండకపోవడమంటే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనే స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నట్టే కదా!