హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్సెస్సీబోర్డు, ఇంటర్బోర్డులను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను ఇంటర్విద్యా జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంటర్‌బోర్డు విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రకటించారు. పీవీ నర్సింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్విద్యా వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌చేశారు.
శుక్రవారం నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం(జీజేఎల్ఏ) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మధుసూదన్‌రెడ్డి మట్లాడుతూ.. రెండు బోర్డులను విలీనం చేయాలన్న సూడో మేధావుల ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేసేందుకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఉచితంగా అందించాలని, అబ్బాయిలకు ఉచిత బస్సుపాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌చేశారు.