హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకున్నది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కార్వైపు ఆశగా చూస్తుండగా, ప్రభుత్వం మాత్రం రైతుభరోసా పంపిణీపై స్పందించింది లేదు. ఆదివారం మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో యాసంగి రైతుభరోసాపై సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేస్తారని ఎదురుచూసిన అన్నదాతలకు ఆ మాటే ఉచ్ఛరించక, చర్చే లేకుండా సమావేశాన్ని ముగించడం ఉసూరుమనిపించింది.
సంక్రాంతికి అంటూ లీకులు..
బీఆర్ఎస్ సర్కార్ జనవరిలోనే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేది. కానీ కాం గ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతుభరోసా ఎప్పుడిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తున్నది. ఓవైపు యాసంగి నాట్లు జోరందుకోవడంతో కర్షకులు రైతుభరోసా కోసం అడుగుతుండటంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల డ్రామాకు తెరతీసింది. అనుకూల పత్రికలు, చానళ్లలో సంక్రాంతికి రైతుభరోసా అంటూ ప్రకటనలు ఇచ్చి వారిని సంతృప్తిపర్చింది. కాగా, పండుగ తర్వాత మేడారంలో క్యాబినెట్ మీటింగ్ ఉండటంతో రైతుభరోసాపై స్పష్టత ఇస్తారనే చర్చ సాగినా సర్కార్కు రైతులకన్నా వేరే ముచ్చట్లు ఎక్కువనే విషయం భేటీ అనంతరం తేలిపోయింది. దీంతో అన్నదాతలకు మళ్లీ నిరాశే మిగిలింది.
మార్చి వరకు లేనట్టేనా?
ప్రస్తుత పరిస్థితులు చూస్తే యాసంగి రైతుభరోసా మార్చి వరకు లేనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనుండటం, వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్తో రాష్ట్రవ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో సర్కార్కు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఉన్నా మార్చి వరకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యవసాయశాఖ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అప్పటికీ కాలేదంటే నిరుడు వానకాలం మాదిరిగానే ఈ యాసంగి రైతుభరోసాకు ఎగనామమే అనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
ఎగవేతలు… కోతలు !
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగితో ఐదు సీజన్లు కాగా, మొన్నటి వానకాలంలోనే సమయానికి రైతుభరోసా పంపిణీ చేసింది. మిగిలిన సీజన్లలో కోతలు, ఎగవేతలతో రైతులకు ఎగనామం పెట్టింది. పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతుభరోసా ఉద్దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ తీసింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసమేనా?
కాంగ్రెస్కు ఎన్నికలొస్తేనే పథకాలు గుర్తుకొస్తాయనే విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతుభరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు, రైతుల చేతిలో చావుదెబ్బ తిన్న అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతుభరోసాతో అన్నదాతల ఓట్లకు గాలం వేసేందుకే కుట్రకు తెరతీసినట్టు వినికిడి.