Caste Survey | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు వెల్లడించలేదంటూ గతంలో పదే పదే ప్రశ్నించిన కాంగ్రెస్.. నేడు తాను చేపట్టిన కులగణన సర్వేపై మౌనం వహిస్తున్నది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వే నివేదికను వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నది. మరోవైపు ఆ నివేదిక ఆధారంగానే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జారీకి అర్హులను ఎంపిక చేస్తున్నట్టు చెప్తున్నది. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 9న ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల)ను ప్రారంభించిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ డి సెంబర్ 9 కల్లా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల ని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, ఆచరణలో పూర్తిగా భిన్నంగా జరిగింది.
సర్వేకు ఇండ్ల స్టి క్కరింగ్ మొదలు డాటా సేకరణ వరకు పూర్తి గా తప్పులతడకగా కొనసాగిందంటూ సామాజికవేత్తలు, కులసంఘాల నేతలు ఆదినుంచీ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మరోవైపు, సర్వే పూర్తయినట్టు ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. డాటా కంప్యూటీకరణ ఏమేరకు పూర్తయిందో వెల్లడించలేదు. సర్వే నిర్వహించిన ప్లానింగ్ విభాగం నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టుగానీ, నివేదిక తమకు చేరినట్టు ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులను సర్వే ఆధారంగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నది. దీం తో సర్వే నివేదికను ప్రభుత్వం గోప్యంగా పెడుతున్నదని సామాజికవేత్తలు, కులసంఘాల నేతలు మండిపడుతున్నారు.
బీసీ మంత్రిని అడిగినా సమాధానం లేదు
సర్వే నివేదిక గురించి బీసీ సంక్షేమ శాఖ మంత్రిని అడిగితే ఆ విషయం తనకేమీ తెలియదంటూ డిప్యూటీ సీఎంను అడగాలని దాటవేస్తున్నారని, డిప్యూటీ సీఎంను అడిగితే సీఎంకే తెలుసునని చెప్పి తప్పించుకుంటున్నారని బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్వే పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని కూడా ప్రభుత్వం నియమించలేదని, ప్రస్తుతం నివేదిక కూడా ప్రభుత్వానికి చేరిందా? చేరలేదా? అనేదానిపై స్పష్ట త లేకుండా పోయిందని చెప్తున్నారు. నివేదికను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలే అడ్డంకి
వాస్తవంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ప్రస్తుతం నిర్ధారించాలి. ఆ బాధ్యత డెడికేటెడ్ కమిషన్‌ది. అధ్యయనం, సిఫారసులు చేయడం వంటి విధులను ఆ కమిషనే నిర్వర్తించాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేకు నోడల్ డిపార్ట్మెంట్గా ప్లా నింగ్ డిపార్ట్మెంట్ను నియమించింది. ప్లా నింగ్ విభాగం ఇటు బీసీ కమిషన్, అటు డెడికేటెడ్ కమిషన్‌తో ఏవిధమైన సంబంధం లే కుండా, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలను స్వీకరించకుండా స్వతంత్రంగా ఇంటిం టి సర్వేను నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించిన అంశాలకే పరిమి తం కాకుండా, మొత్తం రాష్ట్ర జనాభా ఆర్థిక, సామాజిక స్థితిగతులపై వివరాలు సేకరించింది. అయితే, గణాంకాల సేకరణ చట్టం-2008 ప్రకారం సర్వే నిర్వహించాలంటే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నోడల్ అధికారులను నియమించాల్సి ఉంటుంది. సదరు అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాల్సి ఉంటుంది. సర్వేకు సంబంధించిన నిబంధనలను కేంద్రమే నిర్ణయించాల్సి ఉంటుంది.
నిపుణుల కమిటీ ద్వారా సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని రూపొందించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సర్వే నిర్వహించింది. దీంతో సర్వే నివేదికకు ఎలాంటి ప్రామాణికత లేకుండా పోయిందని బీసీ సంఘాల నేతలు, మేధావులు, న్యాయనిపుణులు చెప్తున్నారు. సర్వే నిర్వహించిన తీరు సజావుగా లేదని, కచ్చితమైన డాటాకు అవకాశాలే లేవని స్పష్టంచేస్తున్నారు. కొన్ని ఇండ్లను గణించి, కొన్నింటిని గణించలేదని దీంతో సమగ్ర సమాచార సేకరణ పూర్తికాలేదని చెప్తున్నారు. ఈ సర్వేకు సమగ్రత లేకుండా పోయిందని సేకరించిన గణాంకాలు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించబోవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నివేదికను వెల్లడించినా న్యాయపర వివాదాలు తప్పవని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నివేదికను బహిర్గతం చేసేందుకు సర్కారు వెనకడుగు వేస్తున్నదని, నివేదికపై గోప్యతను పాటిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే గతంలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తరహాలోనే గోప్యంగా ఉంచక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనాడు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయయని, ఈ నేపథ్యంలోనే ఆ నివేదికను వెల్లడించలేదని గుర్తుచేస్తున్నారు.