కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. ఆన్లైన్ ట్రక్షీట్ విధానం నిలిపివేయడంతోపాటు పాత పద్ధతిలోనే కొనుగోళ్లకు ఆదేశాలు జారీచేసింది. ఆన్లైన్ ట్రక్షీట్, అప్పటికప్పుడు మిల్లుల కేటాయింపు, జీపీఎస్ విధానం వల్ల కొనుగోళ్లలో ఏర్పడే అడ్డంకులు, రైతులకు కలిగే ఇబ్బందులపై ఈ నెల 28న ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ‘రైతన్న నెత్తిన ‘ట్రక్షీట్’ శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పడే ఇబ్బందులు, తద్వారా జరిగే ఆలస్యం, జీపీఎస్ విధానం ద్వారా పడే ఆర్థికభారం అంశాలను కండ్లకు కట్టినట్టు ఆ కథనంలో పేర్కొన్నది. ఈ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నిజానికి ఆన్లైన్ ట్రక్షీట్, వాహనాలకు జీపీఎస్ సిస్టం అమలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రైతుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెల్లువెత్తుతున్నా ఇప్పటివరకు అత్యధిక ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభమే కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పడి ఉన్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఆన్లైన్ ట్రక్షీట్ విధానంతోపాటు జీపీఎస్ సిస్టంను అమలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద గతంలో మ్యానువల్ ట్రక్షీట్ పద్ధతి ఉండేది.
అన్నదాతల అవస్థలు
సర్కార్ తాజా నిబంధనలతో ధాన్యం తూకం వేసిన తర్వాత ఆన్లైన్ చేయాల్సి రావడం, ఆన్లైన్ ట్రక్షీట్ జనరేట్ అవ్వడంతోపాటు సదరు ధాన్యం ఏ మిల్లుకు అలాట్మెంట్ అవుతుందో అందులోనే తెలిసేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేశారు. దీనివల్ల రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకు తీసుకుపోవాలన్నది అప్పటికప్పుడే నిర్ణయం జరిగే పరిస్థితి ఉండేది. ఈ విధానంలో ఏర్పడే సాంకేతిక ఇబ్బందులు, నెట్ సమస్యలు, ట్రక్షీట్ జనరేట్ అవడానికి పట్టే సమయం, ఆన్లైన్లో మిల్లుల కేటాయింపు, తద్వారా ఏర్పడే ఇబ్బందులను ‘నమస్తే తెలంగాణ’ కండ్లకు కట్టినట్టుగా ప్రచురించింది. ఇక్కడితో ఆగకుండా జీపీఎస్ విధానం పెట్టడం వల్ల రైతులు ట్రాక్టర్లకు జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటి ద్వారా జరిగే ఆర్థిక భారం, ట్రాక్టర్ల ద్వారా కాకుండా వేరే వాహనాలతో ధాన్యం రవాణాచేస్తే ఏర్పడే ఇబ్బందుల వంటివి ‘నమస్తే’ వెలుగులోకి తెచ్చింది.
బీఆర్ఎస్ పోరుబాట
నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరుబాట పట్టింది. కొత్త పద్ధతులకు స్వస్తి చెప్పి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ సర్కార్ను హెచ్చరిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలుపడమే కాకుండా, ఆన్లైన్ ట్రక్షీట్ విధానాన్ని రద్దుచేసి మ్యాన్వల్ పద్ధతిలోనే ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో రెండు రోజులుగా కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులు ఆందోళన నిర్వహించారు.
సర్కార్ దిద్దుబాటు చర్యలు
కొనుగోళ్ల విషయంలో ఒకవైపు రైతాంగం గగ్గోలు పెడుతుండగా, కొత్త నిబంధనలపై పోరుబాటలోకి వస్తే ఆపడం పెద్ద తలనొప్పిగా మారుతుందని సర్కార్ భావించినట్టు తెలుస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తే నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు గుర్తించింది. దీంతో సర్కార్ మొండికి పోకుండా దెబ్బకు దిగొచ్చింది. ఓపీఎంఆర్ సిస్టంను పాత పద్ధతిలోకి మార్చుతూ బుధవారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ అధికారులు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లకు, డీఎస్వోలు, సివిల్ సప్లయ్స్ డీఎంలకు వాట్సాప్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. గురువారం నుంచి పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు జరుపాలని అదేశించారు. కొనుగోళ్ల అనంతరం మ్యాన్వల్ పద్ధతిలో ట్రక్షీట్ ఇచ్చి, ఆ తర్వాత ఆన్లైన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చి పాతపద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని ఆదేశాలివ్వడంపై రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. తాజా ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న తీవ్ర ప్రతిష్ఠంభనకు తెరపడింది.
6,500 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ప్రభుత్వమే స్వయంగా తేల్చిచెప్పింది. మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుగాను ఇప్పటివరకు 6,500కు పైగా ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం వివిధ పంటల కొనుగోలు వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నది. 90 లక్షల టన్నల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 8.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పేర్కొన్నది. 43.20 లక్షల లక్షల టన్నుల మక్కల ఉత్పత్తి అంచనా ఉండగా, ఇప్పటివరకు 3.46 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపింది. శనగలు 1.25 లక్షల టన్నులు దిగుబడికి గాను ఇప్పటివరకు 30,220 టన్నులు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. 19,808 టన్నుల పొద్దుతిరుగుడు పంట దిగుబడి అంచనా ఉండగా, ఇప్పటివరకు 3,492 టన్నులు కొనుగోలు చేసినట్టు తెలిపింది. తద్వారా అన్నిజిల్లాల్లో పంటల కొనుగోలు జోరుగా జరుగుతున్నాయని సర్కార్ ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
కోనసముందర్ సొసైటీ ముట్టడి

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనసముందర్ సొసైటీని బుధవారం రైతులు ముట్టడించారు. సన్నవడ్లు కాంటా వేసి వారం రోజులు దాటినా లారీలు రాక అలాగే ఉండిపోయాయని, దొడ్డు వడ్లు కాంటా వేయడం లేదని ఆగ్రహించారు. కొనుగోలు ప్రారంభిస్తామని డీఎస్వో హామీతో రైతులు శాంతించారు.