హైదరాబాద్/ జయశంకర్ భూపాలపల్లి, మే 24 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్: కాళేశ్వరం ప్రాజక్టులో భాగమైన మేడిగడ్డ బ రాజ్ మరమ్మతులపై ప్రభుత్వం ఐదు నెలలు గా కాలయాపన చేయడంతో మరింత ముప్పు వాటిల్లింది. కుంగిన పియర్ల కింద మరికొంత గ్యాప్ ఏర్పడింది. పనుల్లో జాప్యం చేయడం తో 21వ పియర్ సమీపంలో ఊట నుంచి నీ రు లోనికి వెళ్తున్నది. చిన్నపాటి బుంగలా మా రేసరికి ఇసుక నింపే ప్రయత్నం చేస్తున్నారు.
విచారణ పేరిట జాప్యం
అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో 20వ పియర్ కుంగడంతో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బరాజ్‌కు మరమ్మతులు చేస్తే బీఆర్ఎస్కే పేరు వస్తుందని ప్రాజెక్టును పక్కన పెట్టింది. నెలల తరబడి విచారణ, ఈఆర్టీ, జియలాజికల్ టెస్టుల పేరి ట కాలయాపన చేసింది. చివరికి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడీషియరీ కమిషన్ ఏ ర్పాటు చేశారు. కాగా ఘోష్ కమిషన్ మేడిగడ్డ ప్రాజెక్టును రిపేరు చేయాలని సూచించింది. ఎన్డీఎస్ఏ సైతం మేడిగడ్డ పనులు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఎల్అండ్టీ మరమ్మతులను మొదలుపెట్టింది.
నిర్లక్ష్యంతో పియర్ల కింద గ్యాప్
ప్రస్తుతం నీటిని కిందికి వదిలినా పనుల్లో కాలయాపన జరగడంతో 21వ పియర్ సమీపంలో ఊట నుంచి నీరు లోపలికి వెళ్తున్నది. దీన్ని అధికారులు ఇసుక బస్తాలతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైనా రాద్ధాంతం చేయడంపై ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 15వ గేట్‌ను ఓపెన్ చేసిన అధికారులు 19, 20, 21వ పియర్ల వద్ద ఉన్న గేట్లను తెరిచేందుకు యత్నిస్తున్నారు. వారం క్రితం వీటిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా రబ్బర్ సీల్ రాకపోవడంతో వాయిదా వేశారు. బరాజ్ మహారాష్ట్ర వైపు ఉన్న ఒకటో బ్లాక్ నుంచి ఏడో బ్లాక్ వరకు చేపట్టిన కాఫర్ డ్యాం పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న పియర్ వద్ద రాఫ్ట్ కిందిభాగంలో ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాల్లో ఇసుక బస్తాలు అమర్చుతున్నారు. మరమ్మతుల కోసం ఎల్అండ్టీ సంస్థ యంత్రాలను తరలించినా అవి నది ఒడ్డునే ఉన్నాయి. ట్రాక్టర్లు, డోజర్లతో ఏడో బ్లాకు వద్దకు దారి పనులు చేస్తున్నారు. శుక్రవారం నుంచి బరాజ్ ఎగువన ఒకటి, దిగువన ఒక ఎక్స్‌కవేటర్‌తో మాత్రమే ఇసుక తీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుక, రాళ్లను తొలగిస్తున్నారు. కాగా బరాజ్ వద్ద భారీ శబ్దాలు, భారీ బొరియలు అంటూ ప్రచారం జరుగుతుండటంతో పరిశీలించేందుకు నేడు మేడిగడ్డకు నిపుణుల కమిటీ రానుందని తెలిసింది.
జియోట్యూబ్‌లతో తక్కువ ఖర్చు
జియోట్యూబ్, జియోటెక్స్‌టైల్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో వరదల నియంత్రణ, కరకట్టల రక్షణ చేపట్టవచ్చని వీరేంద్ర టెక్స్టైల్ ఏజెన్సీ ప్రతినిధుల బృందం వెల్లడించింది. యూపీకి చెందిన వీరేంద్ర టెక్స్టైల్ ఏజెన్సీతో నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ ఇంజినీర్లు శుక్రవారం సమావేశమయ్యారు. జియోటెక్స్‌టైల్, జియోట్యూబ్, జియో మ్యా ట్రిస్, రోప్ గేబియన్స్ టెక్నాలజీపై ఏజెన్సీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇసుకను జియోట్యూబుల్లో నింపి ఒకదానిపై ఒకటి పేర్చే విధానం సమర్థవంతంగా పనిచేస్తుందని, పర్యావరణానికి కూడా అనుకూలమని తెలిపారు. ఈ టెక్నాలజీపై ప్రభుత్వానికి నివేదిస్తామని నీటిపారుదల అధికారులు వెల్లడించారు.