హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): హెచ్ఐవీపై నిఘాతోపాటు, రోగులకు సేవలు అందించే యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఆర్ట్) కేంద్రాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 జిల్లాల్లో 26 కేంద్రాలు ఉన్నాయి. మరో 16 జిల్లా ల్లో ఏర్పాటు చేస్తున్నట్టు వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభు త్వ మెడికల్ కాలేజీల్లో (ఆర్ట్) కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు ఆదేశించడంతో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీశాక్స్) చర్యలు చేపట్టింది. నాగర్కర్నూల్, వనపర్తి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ములుగు, గద్వాల, రంగారెడ్డి, మెదక్, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండలో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పూర్తయిన తర్వాత.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఆర్ట్ కేంద్రాల ఏర్పాటుపై వైద్యారోగ్య శాఖ దృష్టిసారించనున్నది. ప్రస్తుతం ఐదు కాలేజీల్లో కేంద్రాలు ఉండగా.. మిగతా వాటిలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.