Rythu Runa Mafi | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును నిలిపివేయడం, పింఛన్ల చెల్లింపు వంటి సంక్షేమ పథకాలను కొద్దికాలం ఆపివేయడం, ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం వంటి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నది. తాజాగా పరిశ్రమల శాఖకు చెందిన 400 ఎకరాల భూములను కుదువ పెట్టాలని నిర్ణయించింది. సుమారు 20 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి.. రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోని ఖరీదైన స్థలాలను ఎంపికచేసింది. వీటి బహిరంగ మారెట్ విలువ రూ.20 వేల కోట్ల వరకు ఉంటుందని పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి టీజీఐఐసీ భూములను తనఖా పెట్టి రూ.5000 కోట్లుసమీకరించాలని గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మర్చంట్ బ్యాంకర్ కోసం గత నెల 23న టెండర్లు పిలిచింది. ‘సాంకేతిక కారణాలు, లోపాలు’ వంకతో పది రోజుల తర్వాత టెండర్లను రద్దు చేసింది. రూ.5వేల కోట్లు సేకరించినా రుణమాఫీ పూర్తికి సరిపోకపోవడం, మొత్తం నిధులు రుణమాఫీకే ఖర్చు చేస్తే సెప్టెంబర్ నుంచి రాష్ట్రాన్ని నడపడం కష్టంగా మారుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో ప్రభుత్వం ‘భూముల తనఖా’తో అధిక నిధులు సేకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. రూ.10వేల కోట్లు నిధులు సమీకరించాలనుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇందులో రూ.5వేల కోట్లు రుణమాఫీకి ఆగస్టు 15లోగా, మిగతావి సెప్టెంబర్ చివరికి సమీకరించేలా ప్లాన్ వేసినట్టు సమాచారం.
బిల్లుల చెల్లింపులు బంద్
రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఇందులో రూ.20 వేల కోట్లను రుణాల రూపంలో సేకరిస్తున్నట్టు సమాచారం. మిగతా రూ.10 వేల కోట్లను రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్టర్ల బిల్లులతోపాటు జీపీలకు పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రూ.600 కోట్లు ఆపినట్లు చెప్తున్నారు. రెండు నెలలుగా పింఛన్లు ఇవ్వలేదనే విమర్శలున్నాయి.
ఇప్పటికే 28 వేల కోట్ల అప్పు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.28 వేల కోట్ల రుణాలు సేకరించింది. రుణమాఫీ కోసం చేసే అప్పుతో అది దాదాపు రూ.50 వేల కోట్లకు చేరుతుందని అధికారులు చెప్తున్నారు.
పరిశ్రమలొస్తే భూములు ఎక్కడిస్తరు?
కోకాపేట, రాయదుర్గం ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యి. పైగా.. కొత్తగా వచ్చే ఐటీ కంపెనీలు అటువైపే చూస్తున్నాయి. అలాంటిచోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెడితే.. వాటిని ఎప్పుడు విడిపిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.