MPP | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారుల ను నియమించింది. ఇకపై మండలాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడవనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉండగా తాజాగా మండల పరిషత్‌లు కూడా వారి అజమాయిషీలోకి వచ్చాయి. ఎంపీపీల పదవీ కాలం బుధవారం ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించకతప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీవోలు, డిప్యూ టీ డైరెక్టర్లను నియమించాలని ఆదేశాల్లో సూచించా రు. స్పెషల్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఎంపీడీవో కంటే కనీసం ఒక స్థాయి ఎక్కువ క్యాడర్ అధికారి ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. వీరు ఎన్నికలు నిర్వహించే వరకు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం గురువారం ముగియనుంది. జడ్పీలకు జిల్లా కలెక్టర్లను ప్రత్యే క అధికారులుగా నియమించనున్నారు. దీనికి సం బంధించి గురువారం ఆదేశాలు జారీ కానున్నాయి.
వీటికి మినహాయింపు
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల పరిషత్‌లు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బ య్యారం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, మహబూబ్‌నగర్ జిల్లాలోని జ డ్చర్ల, నాగర్‌కర్నూల్ మండల పాలకవర్గాల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. ముగిశాక ఇక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనున్నది.