హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాలేజీని ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో-18ని జారీచేసింది. యూనివర్సిటీ ఎక్కడుంటే, మిగతా విభాగాలను అక్కడే ఏర్పాటు చేయడం సహజం. కానీ ఇందుకు విరుద్ధంగా శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఉంటే, ఇంజినీరింగ్ కాలేజీని హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాలేజీ సరే.. పోస్టులేవీ..?
కొత్త ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగు కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్లుండగా 2025-26 విద్యాసంవత్సరంలో సీట్లను భర్తీచేస్తారు. కాలేజీలో 70 పోస్టులు కావాల్సి ఉండగా, ప్రభుత్వం మంజూరుచేయకపోవడం గమనార్హం.
లా కాలేజీ, ఎం ఫార్మసీ కోర్సు ఇదే వర్సిటీలో కొత్తగా లా కాలేజీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో-19ని జారీచేసింది. మూడేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులను నిర్వహిస్తారు. కొత్తగా బీ ఫార్మసీ కాలేజీలో ఎం ఫార్మసీ కోర్సుకు సైతం అనుమతి లభించింది. ఎం ఫార్మసీ కోర్సు పూర్తిగా సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సు.