Telangana Crime Rate | హైదరాబాద్ , మే 8 (నమస్తే తెలంగాణ) : హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, సైబర్ నేరాలతో రాష్ట్రం ఉకిరిబికిరి అవుతున్నది. ఆర్థిక, సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతంతో పోలిస్తే నేరాల తీవ్రత అమాంతం పెరిగింది. ప్రతిరోజూ ఎకడో ఒకచోట దారుణమైన హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ ఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదంతా ప్రతిపక్ష నేతల ఆరోపణలు కావు.. ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైన నిప్పులాంటి నిజాలు. రాష్ట్రంలో నేరాల రేటు 18.7 శాతం పెరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు పెరుగడం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది.
లైంగిక దాడులు, వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగినట్టు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టెక్నాలజీలో దూసుకుపోతున్న తెలంగాణ, దురదృష్టవశాత్తు సైబర్ నేరాల్లోనూ అదే వేగాన్ని అందుకుంటున్నది. సైబర్ క్రైమ్స్ 2022లో 15,297 నమోదైతే.. 2023లో 18,236 కేసులు నమోదయ్యాయి. 2024లో అత్యధికంగా 27,230 వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నివారణ చర్యలు పట్టుతప్పడంతో సైబర్ కేటుగాళ్లు రాష్ట్ర ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఫోర్జరీ, మోసాలు, ఇతర ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటున్నది. దాదాపు అన్నిరకాల నేరాల్లో తెలంగాణలో పెరుగుదల కనిపిస్తున్నట్టు తాజా నివేదిక తేల్చిచెప్పింది. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, దళితులు, గిరిజనులపై దాడులు, దారుణమైన అవినీతి పెచ్చుమీరుతున్నట్టుగా తాజాగా విడుదల చేసిన 2024 క్రైమ్ నివేదికలో తేటతెల్లం అయింది.
మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు
రేవంత్‌రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి రాష్ట్రంలో దూసుకుపోతున్న క్రైమ్ రేటే నిదర్శనం. దేశంలో మహిళలపై నేరాలు స్వల్పంగా తగ్గగా.. తెలంగాణలో మాత్రం భారీగా పెరిగాయి. చిన్నారులు సైతం నేరాల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నరు. 2024లో 2,103 పోక్సో కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఎన్సీఆర్బీ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో, మహిళలకు ప్రమాదకరమైన రాష్ట్రంగా తెలంగాణ మారింది. 2023లో మహిళలపై 23,678 నేరాలు జరుగగా.. 2024లో 24,495కు నేరాల సంఖ్య పెరిగింది. మహిళలు, చిన్నారుల నగ్న దృశ్యాలను చిత్రీకరించిన కేసుల్లో 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రతిరోజూ సగటున ఆరుగురు చిన్నారులు కామాంధుల వాంఛకు బలవుతున్నారు. చిన్నారులు, ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.
క్రైమ్ రివ్యూలు చేయట్లే..
తెలంగాణలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిందని చెప్పడానికి లక్షల్లో నమోదవుతున్న ఎఫ్ఐఆర్లే నిదర్శనం. హోంమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎలాంటి క్రైమ్ రివ్యూలు నిర్వహించకపోవడం, పోలీసులకు సరైన సూచనలు ఇవ్వకపోవడంతో, పోలీసులు కూడా మంత్లీ క్రైమ్ రివ్యూలకు స్వస్తి చెప్పారు. దీంతో 2024లో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగింది. రాష్ట్రంలో 2023లో ఐపీసీ, బీఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కేసులు మొత్తం 1,83,644 నమోదు కాగా 2024లో 2,17,976 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్లో 18.7 శాతం తగ్గుదల నమోదు కాగా.. తెలంగాణలో మాత్రం 18.7 శాతం పెరుగుదల కనిపించింది. అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 568.9 కేసులు నమోదయ్యాయి. జాతీయ సగటు 418.9గా ఉంది. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు.. మానవ అక్రమ రవాణా, బెట్టింగ్ నేరాల్లో కూడా తెలంగాణ రైజింగ్ ప్రదర్శించింది.
భయంకర నేరాల్లో 172 శాతం పెరుగుదల
తెలంగాణలో దారుణ, భయంకరమైన నేరాల్లో అత్యధికంగా పెరుగుదల కనిపించింది. నడిరోడ్లపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దోపిడీలు, తీవ్రమైన దాడులు, కిడ్నాప్‌లు, గృహహింస, జీవిత భాగస్వాములపై భౌతికంగా దాడులు చేయడం, ఇండ్లు, ఆఫీసులు తగులపెట్టడం వంటి నేరాలు దారుణంగా పెరిగాయి. 2022లో 9,673 నేరాలు, 2023లో 10,069 నేరాలు చోటుచేసుకుంటే.. 2024లో
ఆ సంఖ్య ఏకంగా 27,447కు పెరుగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. 2023 కేసీఆర్ పాలనతో పోల్చితే.. 2024 నుంచి రేవంత్ పాలనలో వైలెంట్ క్రైమ్స్ 172 శాతం పెరిగాయి.
