హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు భయంతో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నది. ప్రజల నుంచి అందినకాడికి దోచుకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని ఆదేశించింది. గతంలో రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లయినా సునాయాసంగా పూర్తిచేసిన సబ్రిజిస్ట్రార్లకు ప్రభుత్వం కళ్లెం వేసింది. ఒక్కో కార్యాలయంలో రోజువారీ స్లాట్లను 54కే పరిమితం చేసి ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలను దూరం చేసింది. దీంతో ప్రజలు తమ స్లాట్ సమయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి పనులు పూర్తి చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
కానీ, రాష్ట్ర రాబడిని పెంచుకోవాలన్న లక్ష్యంతో త్వరలో భూముల మార్కెట్ విలువలను పెంచబోతున్నట్టు ఇటీవల లీకులు ఇచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మార్కెట్ విలువల పెంపు భయంతో ముందస్తు రిజిస్ట్రేషన్ల కోసం పోటెత్తుతున్న ప్రజల సౌలభ్యం కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. రద్దీ అధికంగా ఉండే చంపాపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట, మహేశ్వరం, ఫరూక్నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్కేసర్, నల్లగొండ, పటాన్చెరు, కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను ఉదయం 9.30 సాయంత్రం 6.30 గంటల వరకు పొడిగించాలని నిర్ణయించామని, ఈ నిర్ణయం ఈ నెల 12 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.