హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పంచాయతీల్లో అధికారం చుట్టూ రాజకీయం మొదలైంది. ఉప సర్పంచుల చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం ఆడిన జీవో నాటకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందుగా అధికారాలకు కత్తెర వేసి, ఆపై నిరసనలకు జంకి అధికారుల నిర్లక్ష్యం అంటూ పాతపాట పాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా ఉన్నచోట, బీఆర్ఎస్ మద్దతుదారులు ఉపసర్పంచ్‌లుగా కొనసాగుతున్న గ్రామాలపై ప్రభుత్వం కన్నేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ ప్రత్యర్థి వర్గానికి పట్టున్న రెండో సంతకం పవర్‌ను ఉప సర్పంచ్ నుంచి తొలగిస్తే, నిధులపై పెత్తనం తమకే ఉంటుందన్న వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గుడ్డిగా సంతకం చేస్తారా?
గ్రామ పంచాయతీల చెక్‌పవర్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోలో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవోలకు మాత్రమే చెక్ అప్రూవల్ పవర్ ఇచ్చింది. రెండో సంతకం విషయంలో గందరగోళం నెలకొన్నది. గతంలో ఉపసర్పంచులకు చెక్‌పవర్ ఉండేది. ప్రభుత్వ జీవోలో ఉప సర్పంచ్ ప్రస్తావన లేకపోవడంతో ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ ఉండదన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. రెండో సంతకం విషయంలో కొద్దిసేపటి తర్వాత పంచాయతీరాజ్‌శాఖ క్లారిటీ ఇచ్చింది. ఉపసర్పంచ్ చెక్‌పవర్ రద్దు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేసింది. ఇప్పటివరకు ఆ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పే ప్రయత్నం చేసింది.
తాజా జీవోలో ఉపసర్పంచ్ పేరును మాయం చేసిన ప్రభుత్వం, గందరగోళం మొదలవగానే ప్లేట్ ఫిరాయించిందనే ఆరోపణలు వస్తున్నాయి. సెక్షన్ ఆఫీసర్లు పాత జీవో ప్రతిని పెట్టారని, ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకం చేశారని విడ్డూరమైన వివరణ ఇవ్వడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కోట్లాది నిధులతో ముడిపడి ఉన్న అంశంపై ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకం చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశం లేకుండానే అధికారులు స్వతంత్రంగా జీవోలు మార్చేస్తారా? అనే ప్రశ్నలకు పంచాయతీరాజ్ శాఖ వద్ద సమాధానం లేదు.
నిరసనలకు భయపడి వెనకి తగ్గారా?
తొలుత జీవో బయటకు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నదన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ప్రభుత్వం ఒకసారిగా ఉలికిపడింది. విషయం ముదిరితే రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నట్టు గుర్తించిన సర్కారు.. వెంటనే సవరణ జీవో జారీచేసి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగింది. ప్రభుత్వం చేసిన ఈ తప్పిదం బయటకు పొకకుండా ఉండేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏకంగా మీడియా సంస్థలపై ఒత్తిడి కూడా తెచ్చినట్టు తెలుస్తున్నది. ఉపసర్పంచుల చెక్ పవర్ రద్దు వార్త అవాస్తవం, ఆ వార్తలను నిలిపివేయాలని కోరడం ప్రభుత్వ అసహనాన్ని వెల్లడిస్తున్నది.