హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ స్కూళ్లుంటే 24 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేట్లో 10వేల పాఠశాలలంటే 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో సర్కారు టీచర్ల కంటే ఎక్కువ చదువుకున్నవారున్నారా..? గొప్ప వ్యక్తులున్నరా..? ఉపాధి హామీ కూలీలు కూడా కాన్వెంట్కు పంపిస్తున్నరు.’ ఇది గతంలో సీఎం రేవంత్రెడ్డి ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో 10,832 ప్రైవేట్ స్కూళ్లుంటే వీటిలో 9వేల వరకు బడ్జెట్ స్కూళ్లే. చిన్నా చితకా స్కూళ్లల్లో ఉండేది 100-200 మంది విద్యార్థులే. బీఈడీ పూర్తిచేసినవారు.. టీచర్ కొలువు దక్కించుకోలేకపోయిన వారు పొట్టకూటి కోసం ఏర్పాటు చేసుకున్నవే. ఇలాంటి బడ్జెట్ స్కూళ్లపై కాంగ్రెస్ సర్కారు పెత్తనం చెలాయించబోతున్నది. ఫీజుల నియంత్రణ పేరుతో చిన్నా చితకా స్కూళ్లపై కొరడా ఝుళిపించనుంది. సర్కారు ఆగ్రహానికి బడ్జెట్ స్కూళ్లు బలిపశువులు కానున్నాయి. స్కూళ్లు మూతపడనున్నాయి. ఏకంగా రెండు లక్షల మంది ప్రైవేట్ టీచర్లు, మరో రెండు లక్షల మంది సిబ్బంది రోడ్డునపడనున్నారు. దీంతోపాటు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది.
బడ్జెట్ స్కూళ్లు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి. టీచర్లు, సిబ్బంది, బస్సులు, ఆటోలు, వ్యాన్ల యజమానులు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ స్కూళ్లల్లో ఫీజులు నామమాత్రంగానే ఉంటున్నాయి. బడ్జెట్ స్కూళ్లల్లో ఫీజులు సగటున 25వేల లోపే ఉన్నట్టు ట్రస్మా నేతలంటున్నారు. కానీ తామేదో ఫీజుల దోపిడీ చేసినట్టు చూడటం తగదని వారంటున్నారు. కరోనాతో అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని వాపోతున్నారు. భవనాల అద్దెలు, బ్యాంకు రుణాలు, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని గుర్తుచేస్తున్నారు.
రాష్ట్రంలో కార్పొరేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లను విద్యాశాఖ గాలికొదిలేసింది. ఇంటర్నేషనల్ పేరుతో కొన్ని స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో ఇంజినీరింగ్ ఫీజుల కన్నా కిండర్ గార్డెన్ ఫీజులే అధికంగా ఉంటున్నాయి. ఆయా స్కూళ్లను విద్యాశాఖ అస్సలు పట్టించుకోవడం లేదు. గతంలో కొవిడ్ సమయంలో హైదరాబాద్లోని 10 పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి. విచారణ పేరుతో హడావుడి చేసిన విద్యాశాఖ ఆ తర్వాత ఈ విషయాన్ని వదిలేసింది. తాజాగా ఏర్పాటు చేసే ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) సైతం చిన్న స్కూళ్లపై పెత్తనానికేనన్న విమర్శలొస్తున్నాయి. బడ్జెట్ స్కూ ళ్లపై పెత్తనం చెలాయించకుండా బడా స్కూళ్లల్లో ఫీజులను నియంత్రించడంపై అటు విద్యాశాఖ, ఇటు విద్యా కమిషన్ దృష్టిసారించాలని పాఠశాల యాజమాన్య సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.