హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పేద బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యనందించే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకానికి నేటి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చివరగా 2023 ఆగస్ట్‌లో ఈ పథకం కోసం దరఖాస్తులను పిలిచారు. అంతకుముందు ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా సాయం అందాల్సి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతవరకు ఈ పథకానికి ఎటువంటి సమస్యా రాలేదు. 2023 ఆగస్ట్ తర్వాత కోడ్ రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో బ్రాహ్మణ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. విదేశాల్లో విద్యనభ్యసించడానికి ఈ పథకం ఆసరాతో వెళ్లిన విద్యార్థులకు సకాలంలో డబ్బు అందక వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు 288 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు వారికి ఒక్కరూపాయీ అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో సంక్షేమ పరిషత్‌కు ఇస్తామన్న కోట్లాది రూపాయల నిధులకే కోత పెట్టింది. 2024-25 బడ్జెట్లో ప్రకటించిన రూ.50 కోట్లలో గత మార్చిలో ప్రభుత్వం హడావుడిగా రూ.25 కోట్లు మంజూరు చేసింది.
ఆర్థిక సంవత్సరం ముగిసేముందు ఇచ్చిన రూ.25 కోట్లలో విదేశీ పథకం కోసం పరిషత్ అధికారులు రూ.12.5 కోట్లకు చెక్కు రెడీ చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పంపినా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. దీంతో మార్చి 31లోపే విద్యార్థులకు నగదు వేస్తామని అందరి ఖాతాల వివరాలు మళ్లీ తీసుకున్నా.. జూన్ రెండో వారంవచ్చినా ఒక్కరూపాయి కూడా వారికి అందలేదు. తాజా బడ్జెట్లో పేరు గొప్పలా రూ.100 కోట్లు ప్రకటించినా అవి ఎన్ని వస్తాయో? ఎటు పోతాయో? తెలియని పరిస్థితి నెలకొన్నది. అసలు సర్కార్‌కు బ్రాహ్మణులపై ప్రేమ ఉన్నదా? లేక సవతితల్లి ప్రేమ చూపుతున్నారా? అంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది బ్రాహ్మణులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిదర్శనమని సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
విదేశాల్లో విద్యాభ్యాసం కోసం ప్రవేశాలు పొందిన బ్రాహ్మణ విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యాపథకాన్ని దేశంలోనే మొదటిసారిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆనాడు ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తూ వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏటా 100 నుంచి 150 మంది విద్యార్థుల వరకు లబ్ధి పొందారు. పథకం ప్రారంభించిననాటి నుంచి 2023 వరకు మొత్తం 788 మందికి రూ.83 కోట్లను ప్రభుత్వం అందజేసింది. అందులో 350 మంది పూర్తిగా లబ్ధి పొందారు.
బ్రాహ్మణుల పట్ల తెలంగాణ సర్కారు వివక్ష చూపుతున్నది. ఈసారి బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రకటించారు. కానీ నిరుడు బడ్జెట్లో ప్రకటించిన డబ్బులే ఇంకా పరిషత్‌కు రాలేదు. మార్చి నెలలో రూ.25 కోట్లు విడుదల చేసినా ఆర్థిక శాఖ క్లియరెన్స్ కావాలంటూ పెండింగ్‌లో పెట్టారు. మిగతా 25 కోట్లు వెనక్కుపోయాయి. ఈ పథకాన్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు సరైన సహకారం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆలస్యమైతే పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగు తాం. ఆ దిశగా త్వరలోనే అన్ని సంఘాలను కలుపుకుని కార్యాచరణను ప్రకటిస్తాం.
– మోతుకూరి రామేశ్వర్రావు, అధ్యక్షుడు, తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘాల సమాఖ్య
విదేశీ విద్యాపథకంలో ఎంపికయ్యారని సంతోషించాం. రెండు విడతల డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత ఆగిపోయింది. ఎన్నిసార్లు పరిషత్ ఆఫీస్‌కు వెళ్లినా ఫలితం లేదు. సమయానికి డబ్బు అందక పిల్లలు విదేశాల రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. అమెరికాలాంటి దేశాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. స్టూడెంట్ వీసాపై వెళ్లి వర్క్ చేస్తే వెనక్కు పంపుతారనే భయంలో పిల్లలు ఉన్నారు. మా అబ్బాయితోపాటు మా బంధువుల పిల్లలు ఇద్దరి పరిస్థితి కూడా ఇదే. ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులకు డబ్బులు అందేలా చూడాలి.
– విదేశీ విద్యాపథకం లబ్ధిదారుడి తండ్రి