హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జేఎన్టీయూను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్ర బడ్జెట్లో జేఎన్టీయూపై సవితి తల్లి ప్రేమ చూపించిందని జేఎన్టీయూ ప్రొటెక్షన్ ఫోర్స్ (జేపీఎఫ్) జవ్వాజి దిలీప్, రాహుల్ విమర్శించారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. తమ యూనివర్సిటీకి సర్కార్ కనీసం నిధులు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా జేఎన్టీయూకు 8 అనుబంధ కాలేజీలు ఉన్నాయని, వాటిలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యార్థి సౌకర్యాల కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.