హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానందనగర్ కాలనీలో 70 ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను ఏడాది క్రితం కూల్చివేసిన ప్రభుత్వం ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయం చూపలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ ఇండ్లకు పట్టాలున్నాయని, ఘర్ పట్టీ (ఇంటి పన్ను) కడుతున్నామని, అయినప్పటికీ సంపన్నుల కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనానికి అప్రోచ్ రోడ్డు కోసం తమ ఇండ్లను దయాదాక్షిణ్యాలు లేకుండా నేలమట్టం చేశారని వారు వాపోతున్నారు. వివేకానందనగర్ కాలనీలోని 10 ఫీట్ల వెడల్పు కూడా లేని అకీల్షా మసీదు మార్గంలో 60 ఫీట్ల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ ప్రాంతంలో గత 70 ఏండ్లు నివాసముంటున్న 19 కటుంబాలను ఈ ఏడాది జనవరి 29న ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పొక్లెయిన్లతో కూల్చివేసిందని బాధితులు పేర్కొన్నారు. వివేకానందనగర్ కాలనీ 1957 కన్నా ముందే ఏర్పడిందని, అప్పట్లో తమ తాత ముత్తాతలు ఇక్కడి వ్యవసాయ భూముల్లో కూలీలుగా పనిచేసేవారని బాధితులు వివరించారు. ఆ పక్కనే ఉండే భూముల్లో 30, 40 గజాల స్థలాలను కొనుక్కొని తొలుత గుడిసెలు వేసుకున్నామని, ఆ తరువాత అక్కడే పక్కా ఇండ్లు కట్టుకున్నామని తెలిపారు. 90వ దశకంలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం కోదండరెడ్డి హయాంలో జిల్లా యంత్రాంగం తమకు పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేసిందని చెప్పారు.
ఏడాది నుంచి నిరాశ్రయులే
ఇప్పటివరకు రెండుసార్లు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు.. వీరిని ఆక్రమణదారులు కాదనీ, వారిలో పట్టాదారులు కూడా ఉన్నారని నివేదించారు. కానీ జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసులు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు లేకుండా, తమ ఇండ్లను కూల్చివేసి రోడ్డున పడేశారని బాధితులు తెలిపారు. పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే ఇండ్లు నేలమట్టం చేసి, రోడ్డు విస్తరించాలని కోర్టు 2006లో ఆదేశించిందని, కానీ ఇండ్లు కూల్చివేశారు తప్ప ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నారు.