ఆదిలాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : విజయ డెయిరీకి పాలను విక్రయిస్తున్న రైతులు తమకు రెండున్నర నెలలుగా బిల్లులు రావడం లేదంటూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో పాలను పారపోసి నిరసన చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో మూడు వేల మంది రైతులు ఉండగా.. పాల కేంద్రాల ద్వారా రోజుకు ఆరు వేల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నది. ఒక్కో లీటరుకు రూ.40 నుంచి రూ.60 వరకు రైతులకు ధర వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి 15 రోజులకు రూ.70 లక్షల బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో పాల రైతులకు సంబంధించిన రెండున్నర నెలల బిల్లులు రూ.3.50 కోట్లు బకాయి ఉంది. రెండున్నర నెలలుగా డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విజయ డెయిరీ నుంచి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతాయని, తాము ఏమీ చేయలేమని అధికారులు సమాధానం ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రమంగా బిల్లులు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 నెలలుగా బిల్లులు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.