హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఐటీ విస్తరణ, యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ఐటీ టవర్ల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. కేసీఆర్ హయాంలోనే శంకుస్థాపన చేసిన కండ్లకోయ, మలక్‌పేట ఐటీ టవర్ల నిర్మాణాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రోత్ ఇన్డిస్పర్షన్ పాలసీతో హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఐటీ కంపెనీలు స్థాపించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కండ్లకోయ ఐటీ పార్కుకు 12 ఎకరాలు, మలక్‌పేట ఐటీ టవర్‌కు 11 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రెండు ఐటీ టవర్లకు అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. కండ్లకోయ ఐటీ టవర్‌కు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఐఐసీ) టెండర్లు పిలవగా.. ఓ సంస్థ బిడ్లను దక్కించుకుంది. ఐటీ టవర్‌లో 200 కంపెనీలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక ఐటీ టవర్ల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తే బీఆర్ఎస్కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలేమీలేని ఫోర్త్‌సిటీకి మెట్రోరైలు వేస్తామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… స్థలం కేటాయింపు పూర్తయిన ఐటీ టవర్ల నిర్మాణంపై ఎందుకింత ఆలసత్వం వహిస్తున్నారని ఐటీ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. కండ్లకోయ, మలక్‌పేట ఐటీ టవర్లు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షా 40 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికే వీలుందని చెప్తున్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ఐటీ టవర్లపై సంబంధితశాఖ మంత్రి కనీసం ఒక్క సమావేశం పెట్టకపోవడంతోనే ఐటీ రంగంపై కాంగ్రెస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కండ్లకోయ ఐటీ టవర్ పూర్తి చేయాలంటూ కొంపల్లి ఐటీ ఆంత్రప్రెన్యూర్స్ అసోసియేషన్(కైటియా) ప్రతినిధులు ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబును, ఐటీ, టీజీఐఐసీ అధికారులను కలిశారు. అయినా ఎలాంటి ఫలితంలేదని వారు వాపోతున్నారు. స్థలం కేటాయింపు పూర్తయిన టవర్ల సంగతి మాట్లాడకుండా.. కొత్త ఐటీ టవర్లు నిర్మిస్తామంటూ శ్రీధర్‌బాబు ప్రకటించడం విడ్డూరమని విమర్శిస్తున్నారు.
ఐటీ రంగంలోని అవకాశాలను మన యువత అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదరాబాద్‌తోపాటు, జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహం, ఐటీ మౌలిక వసతుల కల్పనతో చాలా కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయి. సులభతరమైన అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్, టీఎస్‌బీపాస్ విధానాలు పరిశ్రమలను ఆకర్షించాయి. ఉద్యోగార్థులకు శిక్షణ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కీలకంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టీహబ్, టీహబ్ 2.0, వీహబ్‌ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకున్న యువతీయువకులు.. ఐటీ రంగంలో మేటిగా రాణిస్తున్నారు. ఇందులో కండ్లకోయలో ఐటీ టవర్(ఐటీ గేట్‌వే పార్కు) నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆలాగే నగరమధ్యలోని మలక్‌పేటలో ఐటీ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ అదికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. ఈ రెండు ఐటీ టవర్ల నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు ఐటీ టవర్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఐటీ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.