హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ ఫీడర్లకు మీటర్లను బిగించడంలో భాగంగానే కొత్త డిస్కంను సర్కారు తెరపైకి తెచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్కంలు ఉండగా, కొత్తగా మరో డిస్కంను ఏర్పాటుచేయాలని సర్కారు ఆదేశించింది. కొత్త డిస్కం పరిధిలోకి అగ్రికల్చర్ ఫీడర్లు (సబ్స్టేషన్లు), ఎత్తిపోతల పథకాలు, జలమండలి వినియోగిస్తున్న ఫీడర్లు, గృహజ్యోతి, విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు కనెక్షన్లను తెస్తారు. ఆ తర్వాత ఫీడర్లకు మీటర్లను బిగిస్తారని, బిల్లులు జారీచేస్తారని, ఇదే జరగబోతున్నదని విద్యుత్తురంగ నిపుణులు అంటున్నారు.
విద్యుత్తురంగ సంస్కరణల్లో భాగంగా ‘ది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం’ (ఆర్డీఎస్ఎస్)లో చేరాలని కేంద్రం తరుచూ కోరుతున్నది. ఇందుకు తెలంగాణ డిస్కంలు రెడీ అయ్యాయి. ఇందులోభాగంగా ఉన్నతస్థాయి కమిటీని కూడా వేశారు. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఓ డ్రాఫ్ట్‌ను సిద్ధంచేశారు. ఈ ఆదేశాల వెనుక వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన ఉన్నదని విద్యుత్తురంగ నిపుణుల అనుమానిస్తున్నారు. వ్యవసాయ ఫీడర్లు, గృహజ్యోతి, విద్యాసంస్థల కనెక్షన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకొచ్చి.. ఎప్పటికప్పుడు మీటర్ రీడింగ్ తీయాలన్న ఆలోచనలో ప్రభుత్వవర్గాలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంత సులభంకాదన్న వాదనలున్నాయి. ఫీడర్లకు మీట ర్లు పెట్టేందుకు వేల కోట్లు వ్యయం అవుతుందని నిపుణులంటున్నారు. కొత్త డిస్కంకు లైసెన్స్ రావడం సులభంకాదన్న వాదనలున్నాయి. కొత్త డిస్కం వెనుక విద్యుత్తురంగాన్ని ప్రైవేటీకరించే ప్రమాదం పొంచి ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. వ్యూహాత్మకంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు, కార్పొరేట్లకు సింహద్వారాలు తెరుస్తున్నారని అంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలని సూచించారు. మంగళవారం ఇంధన శాఖపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు కొత్త డిస్కం ఏర్పాటు ప్రణాళికను సీఎం ముందుంచారు. మూడో డిస్కంకు సంబంధించిన పీపీఏల అలకేషన్, సిబ్బం ది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్‌గ్రౌండ్ కేబులింగ్ విధానంపై బెంగళూరు సహా ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లోగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తిస్థాయి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, సీఎండీలు హరీశ్, బలరాం, ముషారఫ్, వరుణ్‌రెడ్డి, శరత్ తదితరులు పాల్గొన్నారు.