Gurukula Schools | హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏడాది కాలంగా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తుండటం, విద్యార్థులు మరణిస్తుండటంతో ప్రభుత్వం మేల్కొన్నది. ఆయా స్కూళ్లలో వసతులను పర్యవేక్షించే బాధ్యతను అదనపు కలెక్టర్లకు(స్థానిక సంస్థలు) అప్పగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యాబోధన, వసతులు, నిర్వహణ తీరును పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్లను ఆదేశించింది. భోజన నాణ్యత, తరగతి గదులు, హాస్టళ్లలో వసతులు నిబంధనల మేరకు ఉన్నాయా? లేదా? పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రతి నెల వాటి పనితీరుపై ప్రగతి నివేదిక రూపొందించి కలెక్టర్లకు అందజేయాల్సి ఉంటుంది.
వీటి ఆధారంగా కలెక్టర్లు సమీక్ష నిర్వహిస్తారు. ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్)కు చెందిన మహిళా అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎ స్ తదితర) తరచూ బాలికల రెసిడెన్షియ ల్ స్కూళ్లను సందర్శించి రాత్రి అక్కడే బస చే యాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్కడి పరిస్థితులపై ఏడు రోజుల్లోగా సంబంధిత శాఖకు నివేదిక అందజేయాలని కోరింది. దీనికి ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని నోడల్ అధికారిగా ని యమించింది. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది.