BC Reservations | హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ) : ఓవైపు సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు ముగించాలని, నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు.. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ.. ఏది అమలు చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే తరహాలో ప్లాన్ వేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కోర్టు చెప్పిన ప్రకారం 30 రోజుల్లో రిజర్వేషన్ల ఖరారు అసాధ్యమని నిపుణులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారట. దీంతో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జీవోను విడుదల చేసి ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా రాజకీయం చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ ఉత్తర్వులను ఎవరు కోర్టులో సవాల్ చేసినా బీఆర్ఎస్ పార్టీనే కేసులు వేయించి ఎన్నికల ప్రక్రియకు అడ్డం పడుతున్నదని నెపం నెట్టి, తప్పించుకోవాలని స్కెచ్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. బీసీలకు 42 రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధి అందరికీ తెలిసిందే.
అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి, కేంద్రానికి పంపి చేతులు దులుపుకొన్నదని బీసీలు విమర్శిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించేలా చర్యలు తీసుకోలేదని ఇప్పటికే మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించటానికి సుముఖంగా లేనట్టు సమాచారం. ఒకవేళ రేవంత్రెడ్డి తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినా, హైకోర్టు విధించిన గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయటం అసాధ్యమని కేంద్రంలో పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. జూలై 21నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేయడానికి హైకోర్టు ఇచ్చిన గడువు జూలై 24 వరకే ఉన్నది. కేవలం మూడు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ చేయటం అతికష్టం. ఈ లెక్కన కేంద్ర వైపు నుంచి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల అమలు కష్టమేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగపరంగా ముందుకు వెళ్తే హైకోర్టు నిర్దేశించిన గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయటం అసాధ్యమని న్యాయ నిపుణులు స్పష్టం చేశారట. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఆర్టికల్ 243డీ ప్రకారం రాష్ర్టానికి ఉన్న అధికారాలను వినియోగించుకొని రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగించినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయగా, బీసీలకు పంచాయతీల్లో 22.78 శాతం, మండల పరిషత్లో 18.77 శాతం, జిల్లా పరిషత్లో 17.11 శాతం రిజర్వేషన్లు దకాయి. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లభించాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రిజర్వేషన్లు యథాతథంగా అమలు చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్లు తేలింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం డెడికేషన్ కమిషన్ను కూడా నియమించింది. కుల గణనలో వచ్చిన జనాభా ఆధారంగా బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల సిఫారసులను కమిషన్ 6 క్యాటగిరీలుగా విభజించింది. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతోపాటు ఎంపీపీ, జడ్పీ చైర్ పర్సన్ ..
ఇలా 6 రకాల నివేదికలను తయారు చేసి, ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను నివేదికలో పేర్కొన్నది. పార్లమెంటు ఆమోదం లేకుండా ఈ రిజర్వేషన్ల అమలు అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చి, రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 70 శాతం మించుతాయి. అలా చేస్తే న్యాయ పరమైన చికులు తప్పవని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్ చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు చేసిన చట్టాలను కోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ లెక్కన బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కష్టమేనన్నారు.
ఎటుచూసినా రాజ్యాంగపరమైన, న్యాయపరమైన చిక్కులే ఉత్పన్నం అవుతుండటం, మరోవైపు బీసీల నుంచి ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘జీవో’ మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెరిగితే అభ్యంతరం ఉన్న వాళ్లు కోర్టుకు వెళ్తారని, అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని, కోర్టుల్లో కేసులు వేయించి ఎన్నికలు ఆపించారని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు నుంచి తప్పించుకోవటంతోపాటు ప్రతిపక్ష పార్టీని బద్నాం చేయవచ్చని కాంగ్రెస్ వ్యూహమని విశ్వసనీయంగా తెలిసింది.