హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29 : జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం సుప్రీంకోర్టులో కొట్లాడుతామని టీయూడబ్ల్యూజే-హెచ్143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులను విడగొట్టడానికి కొందరు పెద్ద స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయవాదులతో చర్చించి పిల్ వేస్తామని అన్నారు. రాష్ట్రంలో 23 వేల అక్రెడిటేషన్లు ఉన్నాయని, వాటిని తగ్గించడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. అక్రెడిటేషన్లకు రంగులు మార్చే పనిలో ఉన్నదని, ముఖ్యంగా కొంతమందికి మాత్రమే సెక్రటేరియేట్‌లోకి అనుమతించేలా వాటిని రూపొందిస్తున్నట్టు ఆరోపించారు. జర్నలిస్టులను కుదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం జర్నలిస్టుల హకులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నదని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ యూనియన్ ఎప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇప్పించినట్టు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.వంద కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా సమయంలో రాష్ట్రంలో 450 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డెస్క్ జర్నలిస్టుల అక్రెడిటేషన్ల కోసం పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్ అంతా ఏఐ డిజిటల్ మీడియాదేనని, ఇది ప్రపంచవ్యాప్తంగా రాబోతున్నదని చెప్పారు. యూనియన్ బలోపేతం కోసం వచ్చే మార్చిలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మహాసభలో యూనియన్ కార్యదర్శి మారుతీసాగర్, సలహాదారు రమేశ్ హజారే తదితరులు పాల్గొన్నారు.