హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping ) కేసులో బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్( KCR ) , కేటీఆర్ ( KTR ) , హరీశ్‌రావు ( Harish Rao )లను అరెస్టు చేసి జైలులో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ( Praveen Kumar ) ఆరోపించారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. ఉత్తమ ఇంటెలిజెన్స్ అధికారిగా గుర్తింపు పొందిన విశ్రాంత ఐపీఎస్ ప్రభాకర్ రావును ఏ1 గా చేశారని,చట్టబద్ధంగా విధులు నిర్వర్తించడం ఆయన చేసిన పాపమా? అని ప్రశ్నించారు.
పేర్లు చెప్పాలని ప్రభాకర్‌రావుపై ఒత్తిడి
కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పేర్లు చెప్పాలని ప్రభాకర్‌రావుపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు చాలా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.తెలుగు సీరియల్స్ లాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.మొదట ఏర్పాటు చేసిన సిట్‌లో 350 మంది సాక్షులను విచారణ చేసినా ఏమీ తేలక పోవడంతోమళ్లీ నలుగురు సీనియర్ ఐపీఎస్ లతో సిట్ ఏర్పాటు చేసి మళ్లీ విచారణను సాగదీస్తున్నారని దుయ్యబట్టారు.
పురాతనకాలం నుంచి వేగుల వ్యవస్థ, 18 వ దశకం నుంచే ఫోన్ ఎలా ట్యాప్ చేయవచ్చో చట్టం తీసుకోచ్చారని గుర్తు చేశారు.మంత్రుల ఫోన్లను ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయడం లేదా?ప్రభాకర్ రావును ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.రేవంత్ రెడ్డి ప్రతీకారేచ్చాతో రగిలిపోతున్నారని తెలిపారు. సీఎం మెప్పు కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదని సూచించారు.
ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయి ?
సీనియర్ ఐపీఎస్ ను వేధించడం సబబు కాదని,ఇంత జరుగుతున్నా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఈ కేసులో నాటి సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లను ఎందుకు నిందితులుగా చేర్చలేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కుట్రలు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు.
మహిళా ఐఏఎస్ అధికారిని మంత్రి వేధిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని ,మంత్రులు అసభ్యకర రీతిలో వేధించే స్థాయికి పరిపాలన దిగజారిందని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కె .కిషోర్ గౌడ్ , కె .వాసు దేవ రెడ్డి , తుంగ బాలు, మొహిసిన్ పాల్గొన్నారు .